బీసీ సమాజానికి బీఆర్‌ఎస్‌ మొండిచేయి

BRS is stubborn for BC community– ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎన్నో ఆశలతో పోరాడి సాధించుకున్న రాష్ట్రం సామాజిక తెలంగాణగా ఏర్పడాలని సబ్బండ వర్గాలు కాంక్షించాయని, కానీ ప్రస్తుత పాలన అందుకు విరుద్ధంగా ఉందని, 21న విడుదల చేసిన అభ్యర్థుల ప్రకటనే ఇందుకు నిదర్శనమని ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. ఆధిపత్య కులాలకే 58 సీట్లు కేటాయించడం, 60శాతం ఉన్న బీసీలకు 23 సీట్లు, మిగిలిన 30 స్థానాలు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించడం బీసీ సమాజానికి కేసీఆర్‌ మొండిచేయి చూపించారని విమర్శించారు. హైదరాబాద్‌లోని ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యాలయం(ఓంకార్‌ భవన్‌)లో రాష్ట్ర కమిటీ సభ్యులు మైదంశెట్టి రమేష్‌ అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ ఏ బూర్జువా భూస్వామ్య పాలక వర్గంతో ఏ నాడు ఎన్నికల్లో కలిసి పోటీ చేయలేదన్నారు. మతోన్మాద బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష, సామాజిక శక్తులు ఐక్యంగా పోరాటాలు చేయాలని సూచించారు. కమ్యూనిష్టు, అంబేద్కర్‌ శక్తులను ఐక్యం చేయడానికి ఎంసీపీఐ(యు) శక్తి వంచన లేకుండా కషి చేస్తున్నదని, మిగిలిన వామపక్ష, సామాజిక శక్తులు కలిసి రావాలి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్‌, కుంభం సుకన్య, వసుకుల మట్టయ్య, గోనె కుమారస్వామి, పెద్దారపు రమేష్‌, ఎస్కే నజీర్‌, వడ్తీయ తుకారాంనాయక్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.