– ఆ పార్టీతో గతంలో పొత్తు లేదు.. భవిష్యత్‌లోనూ ఉండదు…
– కవిత అరెస్టు కాకపోవటానికి కారణం సుప్రీం జోక్యం తప్ప బీజేపీతో సంబంధాలు కాదు
– బీఆర్‌ఎస్‌ను దెబ్బ తీసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు :భువనగిరి పార్లమెంటు సన్నాహక సమావేశంలో కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ ఎన్నటికీ ‘బీజేపీకి బీ-టీమ్’ కాబోదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కమలం పార్టీతో గతంలో పొత్తు లేదు.. భవిష్యత్‌లోనూ ఉండబోదని ఆయన తేల్చి చెప్పారు. బీజేపీకి బీఆర్‌ఎస్ బీ-టీమ్ అయితే ఎమ్మెల్సీ కవితపై కేసు ఎందుకు నమోదు చేశారంటూ ప్రశ్నించారు. ఆమె అరెస్టు కాకపోవటానికి కారణం సుప్రీం కోర్టు జోక్యం తప్ప బీజేపీతో సంబంధాలు కాదని అన్నారు. పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో భాగంగా శుక్రవార ం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో భువనగిరి లోక్‌సభ స్థానంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులనుద్దేశించి కేటీఆర్ ప్రసంగిస్తూ… కేసీఆర్ తన 45 ఏండ్ల రాజకీయ జీవితంలో బీజేపీతో ఏనాడూ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలను, ఇద్దరు ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ ఓడించిందని గుర్తు చేశారు. ఆ ఎలక్షన్లలో కుమ్మక్కయిన కాంగ్రెస్, బీజేపీ తమ పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. గత పార్లమెంటు ఎన్నికల్లోనూ, ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీలు అదే విధంగా వ్యవహరించాయని తెలిపారు. మరికొద్ది రోజుల్లో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్, బీజేపీ ఇదే రకంగా వ్యవహరించనున్నాయని ఆరోపించారు. అందుకే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒకే నోటిఫికేషన్ కాకుండా వేర్వేరుగా ఇచ్చారని విమర్శించారు. కేంద్ర మంత్రి అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి కలవగానే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పద్ధతి మారిందంటూ ఎద్దేవా చేశారు. ఈ అంశంపై హైకోర్టుకు వెళ్లినా తమకు నిరాశ తప్పలేదని ఆయన వాపోయారు. మతాన్ని రాజకీయంగా వాడుకోవటం బీజేపీకి అలవాటేనని కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తాము కూడా యాదాద్రి అక్షింతలను నల్లగొండ, భువనగిరిల్లో పంచితే గెలిచేవాళ్లమేమో అంటూ ఆ పార్టీకి చురకలంటించారు. బీజేపీ వాళ్లు పొలిటికల్ హిందువులు అయితే… కేసీఆర్ మతాన్ని మతంగానే చూసే హిందువంటూ పేర్కొన్నారు. అందువల్ల తమది నిజమైన సెక్యులర్ పార్టీ అని అన్నారు.
ఇక ఆ పద్ధతికి స్వస్తి…
‘ఇప్పటి వరకూ ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే పద్ధతి కొనసాగింది…ఇక నుంచి అది ఉండదు. పార్టీ చుట్టూ ఎమ్మెల్యేనే తిరిగే పద్ధతి ఉంటుంది… ఈ విషయంలో క్రమశిక్షణారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం…’ అని కేటీఆర్ నేతలకు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొటోకాల్ నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తోందని విమర్శించారు. వాటిని సీరియస్‌గా తీసుకుంటామనీ, తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఒక కాకికి ఆపదొస్తే మిగతా కాకులు ఒక్క చోట చేరినట్టే… ఒక్క బీఆర్‌ఎస్ కార్యకర్తకు ఆపదొస్తే… మిగతా వారందరూ అండగా నిలవాలని సూచించారు. తమను ఓడించటం ద్వారా ప్రజలు తప్పు చేశారంటూ పార్టీకి చెందిన పలువురు నేతలు అక్కడక్కడా మాట్లాడుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. ఆ రకంగా ప్రజలను తప్పుబట్టటం సరైంది కాదని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ఆ తర్వాత నిర్వహించిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టింది రాష్ట్ర ప్రజలేననే విషయాన్ని మరువకూడదని సూచించారు.
16 వరకు విరామం.. 17 నుంచి మళ్లీ సమావేశాలు…
బీఆర్‌ఎస్ నిర్వహిస్తున్న పార్లమెంటు సన్నాహక సమావేశాలకు నాలుగు రోజులపాటు విరామం ఇవ్వనున్నారు. సంక్రాంతి సందర్భంగా శనివారం నుంచి ఈనెల 16 వరకు ఈ భేటీలకు విరామం ప్రకటించారు. తిరిగి 17న సమావేశాలు ప్రారంభమవుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. 16న నిర్వహించాల్సిన నల్లగొండ ఎంపీ స్థానంపై సమీక్షా సమావేశాన్ని ఈనెల 22న జరుపుతామని ఆయా వర్గాలు వివరించాయి.