కెనడాలో భారతీయ విద్యార్థిపై పాశవిక దాడి..విద్యార్ధి మృతి

టోరంటో: కెనడాలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఓ భారతీయ విద్యార్థి మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో గుర్‌విందర్‌ నాథ్‌ (24) ఒంటారియో ప్రావిన్స్‌లో పిజ్జా డెలివరీబారుగా పనిచేస్తున్నాడు. జులై 9న మిస్సిసాగా ప్రాంతంలో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లిన గుర్‌విందర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, అతడి వాహనాన్ని దొంగిలించారని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. ఈ దాడిలో గుర్‌విందర్‌ తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ జులై 14న మతి చెందిన టొరంటోలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం తెలిపింది. ”గుర్‌విందర్‌ మృతి ఎంతో బాధాకరం. అతడి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం” అని టొరంటోలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ సిద్ధార్థ్‌ నాథ్‌ ప్రకటించారు. గుర్‌విందర్‌ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.