– బట్టబయలు చేసిన పోలీసులు రూ.1.36 కోట్ల రికవరీ
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
వెంచర్ లేదు.. భూమి లేదు.. కంపెనీనే లేదు.. కానీ రంగురంగుల బ్రోచర్లతో బోగస్ కంపెనీ పేరుతో ప్రచారం చేసి.. కార్పొరేట్ స్థాయిలో కార్యాలయం పెట్టుకుని.. పదుల సంఖ్యలో ఏజెంట్లు.. సింగిల్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టండి. ఏడాదిలోనే డబుల్ ప్రాఫిట్ పొందండి అంటూ ఆశ చూపి.. జనం నుంచి రూ.కోట్లు నొక్కేసిన నిందితులను నల్లగొండ ఎస్పీ అపూర్వరావు నేతృత్వంలో జిల్లా పోలీసు టీమ్ పట్టుకుంది. రియల్ వ్యాపారం మాటున 144 మందిని మోసగించి రూ.4.50 కోట్లకు టోకరా పెట్టిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.1,36,38,000 రికవరీ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో బుధవారం ఎస్పీ అపూర్వరావు విలేకర్లకు వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్‌లోని ఓంకార్‌నగర్‌కు చెందిన మామిళ్ల గిరిప్రసాద్(34), బైరామల్‌గూడ పిండి నారాయణరెడ్డి కాలనీకి చెందిన బొడ్డు వెంకటేశ్(23) స్నేహితులు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు. ఇతరులు చేసిన వెంచర్లలో ప్లాట్లు అమ్మిస్తామని చెప్పి, యాజమానుల దగ్గరి నుంచి సదరు లేఔట్ కాపీలను తీసుకున్నారు. ఏడాది కిందట బైరమాల్‌గూడలో గోల్డెన్ ఈగల్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ పేరుతో బోగస్ రియల్ ఎస్టేట్ కంపెనీని ప్రారంభించారు. ఆ కంపెనీ పేరు మీద బ్రోచర్లు తయారు చేయించి సువర్ణావకాశం అంటూ కొత్త స్కీమ్‌కు ప్లాన్ చేశారు. రూ.10 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనండి.. ఏడాది తర్వాత ప్లాట్ తిరిగిచ్చి రూ.20 లక్షలు తీసుకెళ్లండి అంటూ పెద్దఎత్తున ప్రచారం చేశారు. అలా కొందరి నుంచి సొమ్ము చేసుకున్నారు.
30 శాతం కమీషన్ పేరుతో ఎర..
మామిళ్ల గిరిప్రసాద్, బొడ్డు వెంకటేష్ కలిసి తమకు అప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పరిచయం ఉన్న బట్టపల్లి గ్రామానికి చెందిన మాదగోని వెంకటేశ్ గౌడ్‌ను కలిశారు. ”మా గౌతమ్స్ ఈగల్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీలో ఎవరైనా తెలిసిన వారు ఉంటే పెట్టుబడి పెట్టించండి. అందుకు ప్రతిఫలంగా 30 శాతం కమీషన్ ఇస్తామని” ఆయనకు ఆశ చూపారు. అలా మాదగోని వెంకటేశ్‌గౌడ్‌ను వారి వద్దే ఏజెంటుగా నియమించుకున్నారు. అతనిపాటు బర్ల శేఖర్ సైతం తనకు తెలిసిన వారితో బోగస్ కంపెనీలో పెట్టుబడి పెట్టించి 30 శాతం కమీషన్ తీసుకున్నారు. కస్టమర్లను తీసుకొచ్చిన వారికి కూడా 30 శాతం కమీషన్ ఇస్తామని చెప్పడంతో మాదగోని వెంకటేశ్‌గౌడ్ తన కింద కొంతమందిని ఏజెంట్లుగా పెట్టుకున్నారు. అలా వెంకటేశ్‌గౌడ్ కస్టమర్లను పెద్దఎత్తున మోసం చేసి ప్లాట్లను కొనుగోలు చేయించారు. వీరితోపాటు మర్రిగూడకు చెందిన సుధాకర్, చెరుకు శ్రీరాములు, బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన పచ్చిపాల గణేశ్, సురిగి రమేశ్ సైతం కస్టమర్లను మోసగించారు.
నమ్మించేందుకు బాండ్ పేపర్లు.. పోస్ట్ డెటెడ్ చెక్కులు..
తమ కంపెనీలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు వచ్చిన కస్టమర్లకు ఎలాంటి అనుమానం రాకుండా మామిళ్ల గిరిప్రసాద్, బొడ్డు వెంకటేశ్, గిరిప్రసాద్ కంపెనీ పేరు మీద ఇన్వెస్టర్లు అందరినీ పిలిచి పార్టీ పెట్టారు. ‘మా కంపెనీ మంచి లాభాలు ఇస్తుంది..’ అని చెప్పి కొంత మంది తమకు కావాల్సిన వాళ్ళకి డబ్బులు పంచినట్టు నమ్మించి బాండ్ పేపర్లు రాసివ్వడంతో పాటు ప్రామిసరీ నోట్లు, పోస్ట్ డెటెడ్ చెక్కులపై సంతకాలు పెట్టి ఇచ్చేవారు. అలావచ్చిన డబ్బులో 30 శాతం ఏజెంట్ కమీషన్ పోగా, మిగిలిన దాంట్లో 40 శాతం జల్సాలు, సినిమా షూటింగ్‌లకు మామిళ్ల గిరిప్రసాద్, బోడ్డు వెంకటేశ్ ఖర్చు చేసేవారు. మరో 30 శాతం డబ్బును మాత్రం ఎవరైనా కస్టమర్లు వచ్చి మా డబ్బు వెనక్కి ఇవ్వాలని గొడవ చేస్తే ఇచ్చేందుకు వీలుగా ఆఫీసులోనే దాచిపెట్టారు. ఇప్పటివరకు ఈ మాయగాళ్లు 144 మందిని మోసం చేసి రూ.4.50 కోట్లు స్వాహా చేశారు. ఇదిలావుంటే.. ఆగస్టు 6న అన్నపూర్ణ స్టూడియోలో గౌతమ్స్ ఈగల్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రయివేటు లిమిటెడ్ ప్రొడక్షన్ నంబర్ 1 పేరు మీద సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఒకవేళ బాధితులంతా వచ్చి డబ్బులు ఇవ్వాలని బలవంతం చేస్తే ఐపీ పెట్టి పరారయ్యేందుకు నిందితులు మామిళ్ల గిరిప్రసాద్, బొడ్డు వెంకటేశ్ పథకం వేయగా.. పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.
కంపెనీ పేరు.. మకాం మార్చి..
కొన్నాళ్లకు అదే పేరుతో అప్పటికే రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందనే విషయం తెలుసుకుని సదరు వ్యాపారులు ఓంకార్‌నగర్‌కు మకాం మార్చారు. అక్కడ ఐదు దుకాణాలను అద్దెకు తీసుకుని కార్పొరేట్ కార్యాలయం తరహాలో ‘గౌతమ్స్ ఈగల్ ఇన్‌ఫ్రా డెవెలపర్స్ ప్రయివేటు లిమిటెడ్ పేరుతో ఆఫీసు ఓపెన్ చేశారు.ఈ కార్యాలయంలో నమ్మకంగా పనిచేసేందుకు నానక్‌నగర్‌కు చెందిన బర్ల శేఖర్‌ను నియమించుకున్నారు. ప్రతి కస్టమర్ నుంచి వచ్చే డబ్బులో 0.8 శాతం శేఖర్‌కు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆఫీసు వ్యవహారాలన్నింటినీ బర్ల శేఖర్, బొడ్డు వెంకటేశ్ చక్కబెట్టేవారు. గౌతమ్స్ ఈగల్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రయివేటు లిమిటెడ్ పేరుతో పాంప్లేట్స్, బ్రోచర్లు, బుక్‌లెట్స్, నోట్ బుక్స్ ప్రింట్ చేయించి పెద్దఎత్తున మార్కెటింగ్ చేశారు. ”రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు మా వెంచర్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఏడాదిలోనే డబుల్ అమౌంట్ తీసుకెళ్లండి” అంటూ ప్రచారం చేశారు.
దీన్ని నమ్మించేందుకు వీలుగా ముందుగానే ప్లాట్ అగ్రిమెంట్ కాగితాలతోపాటు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి కస్టమర్లను బురిడీ కొట్టించారు. దీనికితోడు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో ఓంకార్ నగర్‌కు చెందిన మామిళ్ల గిరిప్రసాద్ పేరుతోపాటు సదరు కంపెనీ పేరుపై భూమి ఉన్నట్టు, వెంచర్ లేఔట్ కాపీలను చైతన్యపురిలో తయారు చేయించారు.
అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు
అక్రమాలకు పాల్పడితే ఎవ్వరినీ విడిచిపెట్టబోం. సువర్ణావకాశమంటూ అమాయక ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా మా దృష్టికి తీసుకురావాలి. రియల్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కె.అపూర్వరావు (నల్లగొండ ఎస్పీ)