మండుతున్న కూరగాయలు

– అకాల వడగండ్ల వానలతో తగ్గిన దిగుబడులు
– కొత్త పంట వచ్చే వరకు ఇదే పరిస్థితి
– కిలో ధర రూ.80 నుంచి రూ.100 పైనే
– కూరగాయల తిండి కూడా తినలేని దైన్యస్థితి
– రెండు నెలలుగా మండుతున్న చికెన్‌ ధరలు
– ఉమ్మడి మెదక్‌ జిల్లాలో తగ్గిన కూరగాయల సాగు
‘కూలీనాలి చేసుకుని పొట్టపోసుకుంటున్నం. అన్నింటి ధరలు మండిపోతున్నయి. చికెన్‌ దుకాణంకు పోవడమే బందైంది. ఇప్పుడు కూరగాయల ధరలూ మండిపోతున్నయి. పావు కిలో కొనాలన్నా పైసలు చాలట్లేదు. వంద రూపాయలు పెడితే నాలుగు రకాల కూరగాయలొచ్చేవి. ఇప్పుడు ఏదడిగినా పావుకిలో సరుకుకు కిలో ధర చెబుతుండ్రు. మా గరీబోళ్లకు కాయగూరల తిండి కూడా కరువైంది. ఇబ్బడిముబ్బడిగా పెరిగే ధరలతో మాలాంటి వాళ్లకు పూట గడవడమే గగనమైంది. వానల్లేక పంటల్లేవంటున్నరు. మార్కెట్‌లో వ్యాపారులు ధరల్ని పెంచి అమ్ముతున్నరు. ఏం చేస్తం… ఉన్నంతలో సర్దుకుపోతున్నం’ ఇదీ..! సంగారెడ్డికి చెందిన అనుసూజ ఆవేదన.
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘పంట బాగా పండినప్పుడు ధరరాలే. ఇప్పుడు పంటలేదు. అయినా ధరలు పెరిగాయి. అతివృష్టి.. అనావృష్టి. బెండకాయ, గోరుచిక్కుడు, తురాయి, బుడమకాయ సాగు చేసిన. వర్షాల్లేక పంట దిగుబడి తగ్గింది. ఉన్న కొద్దిపాటి తెంపి మార్కెట్‌కు తెచ్చిన. ధర బాగానే ఉంది. కానీ..! పిరంగున్నయని జనం కొనడంలేదు. కిలో బదులు పావుకిలో కొంటున్నరు. వర్షాలు పడితే పంట దిగుబడులు పెరిగుతయి. కొత్త పంట వచ్చే వరకు రెండు నెలల వరకు ధరలు ఇలానే పెరిగొచ్చు” ఇదీ..! నర్సాపూర్‌కు చెందిన రైతు దేవదాస్‌ అభిప్రాయం. ”సరుకురాట్లేదు. తెల్లవారజాము బోయినపల్లి మార్కెట్‌కెళ్లినం. కూరగాయలు దొరకలే. కొద్దిపాటి సరుకే పోసిండ్రు. అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నయి. వర్షాల్లేక కొంత ఇబ్బందిగా మారింది. కొత్త పంట వస్తే గానీ..! కూరగాయల ధరలు తగ్గవు. బైపాస్‌ మార్కెట్‌లో ఒక రోజు రెండు క్వింటాళ్ల పచ్చిమిర్చి అమ్మేది. గురువారం పావుకింటా కూడా అమ్మడుపోలేదు. ధరలు పెరిగే సరికి జనం కొనుగోలు చేయడం తగ్గించిండ్రు. కొద్దిపాటిగా కొంటున్నరు. మార్కెట్‌లో వ్యాపారాలు ఢల్‌గా మారాయి” ఇదీ..! కూరగాయల వ్యాపారి నర్సింహ మాట. మార్కెట్లలో ఉన్నట్టుండి కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. అతివృష్టి…అనావృష్టి వల్ల అన్ని పంటల మాదిరే కూరగాయలు, ఆకుకూరల పంటలు కూడా దెబ్బతిన్నాయి. పంట దిగుబడులు అమాంతం తగ్గడంతో మార్కెట్‌కు సరుకు రావడం తగ్గింది. జనం వినియోగం మేరకు సరుకు రాకపోయే సరికి మార్కెట్‌లో దళారులు ధరల్ని పెంచేశారు. పండించిన రైతు నుంచి సరుకు హౌల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారుల చేతులు మారి వినియోగదారుడి చేతికొచ్చే సరికి కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాలోని ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో జరిగే కూరగాయల మార్కెట్‌లో ధరలు ఆకాశాన్నంటాయి. రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లు, వీధి సంతల్లో ఏ రకం కూరగాయల్ని కొందామన్నా ధర వినేసరికి గుబులు పుట్టే పరిస్థితులు నెలకొన్నాయి. కూరగాయల మార్కెట్లల్లో ధరల పట్టికల్ని చూస్తే పావుకిలో కొనాలన్నా వీలుగాని పరిస్థితులేర్పడ్డాయి. పండించే రైతులు ప్రకృతి వైపరిత్యాల వల్ల తగ్గిపోతున్నారు. మరో పక్క కూరగాయల సాగుకు ప్రభుత్వం ప్రత్యేకమైన రాయితీలివ్వడంలోనూ ఇబ్బందులున్నాయి. మార్కెట్‌ సదుపాయం లేకపోవడం, వరుసగా నష్టాలొస్తుండడంతో కూరగాయల సాగు మానేసి వరి, పత్తి వంటి పంటల వైపు మళ్లుతున్నారు.
అన్నింటి ధరలు పెరిగాయి..
గురువారం సంగారెడ్డిలోని బైపాస్‌రోడ్డులో కూరగాయల సంతకెళ్లి పరిశీలిస్తే అన్ని రకాల కూరగాయల ధరలూ పెరిగాయి. పచ్చిమిర్చి కిలో ధర రూ.80, క్యాప్సికం రూ.80, బిన్నీస్‌ రూ.120, చిక్కుడు రూ.100, క్యారెట్‌ రూ.80, దొండకాయ రూ.80 పలికింది. దోసకాయ రూ.60, టమాటా రూ.50, బీర రూ.60, గోరుచిక్కుడు రూ.60, చామగడ్డ రూ.60, కాకరకాయ రూ.60 ఉంది. 3 మునగకాయల ధర రూ.20, మూడు కిలోల ఉల్లిగడ్డ ధర రూ.50 ఉంది. సోరకాయ, కీరదోస, బీటురూట్‌ వంటి ధరలు కూడా పెరిగాయి. కూరగాయల ధరలు పెరగడంతో సామాన్యులే కాదు సంపన్నులు కూడా కొనుగోలును తగ్గించేశారు. వారాంతపు సంతల్లో ఆ వారానికి సరిపడా కూరగాయాల్ని కొనుగోలు చేస్తుంటారు. ఏ రకమైన కూరగాయలైనా సరే కిలో కొంటున్నది లేదు. పావు కిలో అరకిలో కూడా కొనలేకపోతున్నారు.
చికెన్‌ తినలేని పరిస్థితి
మార్కెట్‌లో కొన్ని నెలలుగా చికెన్‌ ధరలు మండిపోతున్నాయి. వేసవిలో సహజంగా చికెన్‌ వినియోగం తగ్గిస్తుంటారు. కానీ, ధరలు మాత్రం విపరీతంగా పెరిగాయి. ఆదివారం, ఇతర ప్రత్యేక రోజుల్లో చికెన్‌ తినే వాళ్లకు ధరలు భారంగా మారాయి. రెండు నెలలుగా కిలో చికెన్‌ ధర రూ.250 నుంచి 300 వరకు ఉంది. వేసవిలో ఎండల తీవ్రత వల్ల పౌల్ట్రీలో బాయిలర్‌ కోళ్ల పెంపకం కష్టంగా మారింది. ఎక్కువ మొత్తంలో చనిపోతుండటంతో మార్కెట్‌ అవసరాల మేరకు కోళ్లు రావట్లేదంటున్నారు. ధరలు పెరగడం వల్ల చికెన్‌ సెంటర్లలో గిరాకీల్లేకుండా పోయాయని నజీర్‌ అనే చికెన్‌ వ్యాపారి తెలిపారు.
అతివృష్టి.. అనావృష్టి
కూరగాయలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏప్రిల్‌, మే నెలల్లో కురిసిన అకాల వడగండ్ల వానల వల్ల వరి, ఇతర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందులో కూరగాయల పంటలు బాగా దెబ్బతిన్నాయి. వర్షాలు, గాలులు, వడగండ్ల వల్ల కూరగాయల తోటలు నేలవాలిపోయాయి. పూత, పిందె రాలిపోయింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో టమాటా, ఉల్లిగడ్డ, దొండ, బెండ, సోరకాయ, దోసకాయ, పచ్చిమిర్చి, బీర వంటి పంటలు అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నాయి. వేసవి సీజన్‌లో కూరగాయల వినియోగం బాగా ఉంటున్నందున ఆ సమయానికి దిగుబడులు వచ్చే విధంగా సాగు చేసిన కూరగాయల పంటలన్నీ దెబ్బతినడంతో తెలంగాణ అంతటా దిగుబడులు తగ్గాయి. ప్రస్తుతం మార్కెట్‌కు కూరగాయలు సరిపడ రాని కారణంగా ధరలు పెరిగాయి. ఖరీఫ్‌లో కూరగాయల సాగు చేసేందుకు విత్తనాలు తెచ్చుకున్నారు. టమాటా, ఉల్లినార్లు పోశారు. వర్షాల్లేకపోవడంతో ఆ పంటల సాగు ఆగిపోయింది. మరో రెండు నెలల వరకు కూడా కూరగాయలు దిగుబడులు సరిపడా వచ్చే అవకాశం లేనందున ధరల భారం తప్పదని వ్యాపారులు పేర్కొంటున్నారు.