బస్టాండ్లు, హోటళ్లు, రెవెన్యూ కేంద్రాలే అడ్డా

కాంగ్రెస్‌ వినూత్న సర్వే
– పారదర్శకత కోసం మండలస్థాయి నేతల ఎంపిక
– పకడ్బందీగా ఏఐసీసీ కార్యచరణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఎన్నికల వేళ వివిధ పార్టీలు తమ బృందాలను కిందిస్థాయికి దింపి ఓటర్ల నాటిని పట్టుకునేందుకు ప్రయత్నించడం పరిపాటి. సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయింపులూ జరుగుతాయి. కానీఓటర్ల ఆలోచన విధానంలో వస్తున్న మార్పులను పసిగట్టడంలో సర్వేలు విఫలమవుతున్నాయి. పైకి చెబుతున్నది ఒకటి, వారు ఆచరిస్తున్నది మరొకటి. మొత్తంగా రాజకీయ సర్వేల్లో ఓటరు నాడి అంతకు చిక్కకపోవడంతో రాజకీయ పార్టీల అంచనాలు తప్పి బొక్కబోర్లా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతున్నది. ప్రజలతో మమేకమై ఓటర్ల నాడి పట్టుకునేందుకు వంద మెట్లు దిగుతున్నది. సర్వేల పేరుతో ఏసీ రూముల్లో ఉండి కాలం వృధా చేయకుండా ఓ వినూత్న సర్వేకు ఆ పార్టీ శ్రీకారం చుట్టినట్టు విశ్వసనీయ సమాచారం. అందుకు ఓటర్‌ టు ఓటర్‌ కాకుండా బస్టాండ్లు, ఫంక్షన్లు, హోటళ్లు, రెవెన్యూ కార్యాయాలను తన అడ్డాలుగా ఎంచుకున్నది. చివరకు బార్లు, రెస్టారెంట్లను కూడా వదిలిపెట్టడం లేదు. ఎక్కడ ఓ గుంపు కనిపించినా ఆ గుంపులో జొరపడి రాజకీయాలపై చర్చిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ప్రభుత్వాల నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? బీఆర్‌ఎస్‌ పాలనలో కొనసాగుతున్న వైఫల్యాలు, వాటి నుంచి గట్టేందుకు రానున్న ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఏయే అంశాల్లో బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత ఉన్నదో తెలుసుకునేందుకు సర్వే బృందాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు పెద్ద పెద్ద నాయకులతో సర్వే చేయించకుండా మండల స్థాయి నాయకులను ఎంచుకున్నది. మూడు రాష్ట్రాల మండలస్థాయి నాయకులను ఏఐసీసీ ఎంపిక చేసి తెలంగాణకు పంపినట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాల వారీగా ఆయా టీమ్‌ లీడర్లు పంచుకుని సర్వేలు చేస్తున్నారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలను కాంగ్రెస్‌ అధిష్టానం మహారాష్ట్ర బృందానికి అప్పజెప్పింది. మహబూబ్‌నగర్‌, మెదక్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ బాధ్యతలను కర్నాటక టీమ్‌ తీసుకుంది. ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లాల బాధ్యతలు కేరళ బృందం తీసుకుంది. ఆ బృందాలకు తెలుగు అనువాదాలకు జత చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఏఐసీసీ అత్యంత రహస్యంగా ఉంచింది. సర్వేల నివేదికలను ఎప్పటికప్పుడు అధిష్టానానికి నేరుగా పంపేందుకు ఏర్పాట్లు చేశారు. వాటి ఆధారంగా రాష్ట్ర కాంగ్రెస్‌కు అధిష్టానం మార్గనిర్దేశం చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకులు ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటూనే, క్షేత్రస్థాయి ఫీడ్‌ బ్యాక్‌ కూడా తీసుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.