ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా బస్సులు నడపాలి

  • రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

నవతెలంగాణ హైదరాబాద్: ఆర్టీసీ బస్సు సర్వీసులపై సమీక్షించిన మంత్రి శ్రీధర్ బాబు నవ తెలంగాణ మల్హర్ రావు. ప్రయాణికులకు ఇబ్బందులు కల్గకుండా బస్సు సర్వీసులు నడపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.సోమవారం మంథనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీధర్ బాబును కరీంనగర్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుచరిత మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ళ మహాలక్ష్మి పథకం క్రింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అమలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో గతంలో ప్రతిరోజు 2 లక్షల 40 వేల మంది ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తే నేడు ఆ సంఖ్య 3 లక్షల 70 వేలకు పెరిగిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రస్తుతం 60 శాతం వరకు మహిళ ప్రయాణికుల ఆక్యుపెన్సీ ఉందని ఆర్టిసి రీజనల్ మేనేజర్ తెలిపారు.
అనంతరం ఆర్టీసీ బస్సు సర్వీసులపై మంత్రి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మంథనిలోని గ్రామీణ ప్రాంతాల్లొ బస్సు సర్వీసు లేని గ్రామాలకు నూతన సర్వీసులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, పాఠశాల విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా బస్సు సర్వీసులు నడపాలని మంత్రి ఆదేశించారు. వరుస సెలవులు వస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్సు సర్వీసులు పెంచాలని, అవసరమైన రూట్లలో అదనపు ట్రిప్పులు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్.ఎం.లు ఎస్. భూపతి రెడ్డి, సత్యనారాయణ, మంథని డి.ఎం. రాజశేఖరం, సంభందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.