– టికెట్ల కేటాయింపుపై ఆశావహుల్లో అసంతృప్తి
– వేరే పార్టీలోకి అధికార పార్టీ నేతలు
– మంచిర్యాల టికెట్ బీసీలకివ్వాలని డిమాండ్
– స్వతంత్రంగా బీసీ అభ్యర్థిని బరిలో నిలిపేందుకు సమాయత్తం
అధికార బీఆర్‌ఎస్ పార్టీలో అసమ్మతి గళం తారాస్థాయికి చేరింది. టికెట్ల కేటాయింపు పూర్తయిన నాటి నుంచి అసంతృప్తులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాండ్లు టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న ఆశావహుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఫలితంగా వారి అనుచరులు బీఆర్‌ఎస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. మంచిర్యాలలో ఈ పరిస్థితి మరింత అధికమవుతోంది. తాజాగా హాజీపూర్ జడ్పీటీసీ శిల్ప, మాజీ జెడ్పీటీసీ ఆశాలత, దండేపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌తో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. వీరితోపాటు ఖానాపూర్ నియోజకవర్గంలోనూ గులాబీ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్‌లో చేరడం అధికార పార్టీలో అసమ్మతి ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉండగా ఏడింటిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే బీఆర్‌ఎస్ అధిష్టానం మళ్లీ టికెట్లు కేటాయించింది. ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లను మార్చి కొత్త వారికి టికెట్లు ఇచ్చింది. మార్చిన స్థానాలతోపాటు తాజాగా సిట్టింగ్‌లకు కేటాయించిన స్థానాల్లోనూ ఈసారి తమకు పార్టీ టికెట్లు వస్తాయని అనేక మంది ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు. మూడు స్థానాల్లో మినహా మిగతా చోట్ల కొత్త వారిని అధిష్టానం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఆయా స్థానాలు ఆశించిన పలువురు నేతలు అసంతృప్తిలో ఉన్నారు. మంచిర్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్‌రావుకు మరోసారి టికెట్ దక్కింది. ఈ స్థానం నుంచి మాజీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ పుస్కూరి రామ్మోహన్‌రావు ఆశించారు. కానీ అధిష్టానం ఈయన పేరును పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఆయన అనుచరులు, ముఖ్య కార్యకర్తలు గులాబీ పార్టీని వీడి హస్తం పార్టీలో చేరిపోయారు. ఖానాపూర్ నియోజకవర్గంలోనూ పలువురు బీఆర్‌ఎస్ పార్టీనీ వీడారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు టికెట్ లభించకపోడంతో ఆమె అనుచరులు, నాయకులు కొందరు కాంగ్రెస్‌లో చేరారు. జన్నారం మాజీ ఎంపీపీ శంకరయ్య, అనుచరులు హస్తం పార్టీలో చేరిపోయారు. కడెం మండలంలోనూ పలువురు యువకులు కాంగ్రెస్‌లో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముధోల్‌లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి అసమ్మతి సెగ తగిలింది. ఆయనకు టికెట్ ఇవ్వకూడదని ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇలా పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ టికెట్లు దక్కని వారు అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉండగా.. మరికొందరు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.
మంచిర్యాలలో ఏకతాటిపై బీసీలు..!
మంచిర్యాల నియోజకవర్గంలో 20ఏండ్లకు పైబడి అగ్రవర్ణాలే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారు. ప్రధాన పార్టీలన్నీ వారికే టికెట్లు కేటాయించడంతో ఇందులో ఎవరు గెలిచినా అగ్రవర్ణాల వ్యక్తే ఎమ్మెల్యేగా ఉంటున్నారని బీసీలు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీసీల ఓట్లు గణనీయంగా ఉన్నప్పటికీ చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించడం లేదు. గతంలో లక్షెట్టిపేట నియోజకవర్గం ఉన్న సమయంలో 1978లో జనతా పార్టీ నుంచి చుంచు లక్ష్మయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ బీసీల ప్రాతినిధ్యం లేకుండా పోయింది. నియోజకవర్గాల పునర్విభజనలో మంచిర్యాల నియోజకవర్గ కేంద్రంగా మారినా.. పరిస్థితిలో మార్పులు రావడం లేదని బీసీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మెజార్టీ సామాజిక తరగతులైన పెరిక, మున్నూరుకాపు, పద్మశాలి, ముదిరాజ్, యాదవులు, గౌడ్ తదితర బీసీ తరగతులందరూ ఏకమై మంచిర్యాల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అధికార బీఆర్‌ఎస్ పార్టీ టికెట్ బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి సైతం బీసీలకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న ఎన్నికల్లో బీసీ వ్యక్తిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిపి మద్దతు తెలుపుతామని ప్రకటించారు.