మూడో రోజుకు బక్సర్‌ పవర్‌ ప్లాంట్‌ నిరవధిక సమ్మె

– వేతనాల పెంపు, ఎనిమిది గంటల పనికి కార్మికుల డిమాండ్‌
పాట్నా: బీహార్‌లోని చౌసా గ్రామంలో నిర్మాణంలో ఉన్న బక్సర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించిన దాదాపు 3,000 మంది కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె మూడో రోజుకు చేరుకున్నది. వేతనాలు పెంచాలనీ, ఎనిమిది గంటల పని మాత్రమే ఉండాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. ఇక్కడ తక్కువ వేతనాలు, 12 గంటల పనిని నిరసిస్తూ కార్మికులు ఈనెల 21 న ఆకస్మికంగా సమ్మెకు దిగారు. కాగా, కార్మికులు శనివారం తమ నివాస కాలనీల్లో నిరసనకు దిగారు. ”విద్యుత్‌ ప్లాంట్‌ అధికారులు, ఎల్‌ అండ్‌ టీ, కాంట్రాక్టర్లు మా డిమాండ్లను నెరవేర్చడం గురించి మాకు రాతపూర్వక హామీ ఇస్తే తప్ప మేము సమ్మెను, నిరసనను విరమించము” అని వర్కర్‌ లీడర్‌ గౌరవ్‌ రారు అన్నారు. 12 గంటలు పనిచేస్తున్నా కార్మికులకు 8 గంటలకే జీతాలు ఇస్తున్నారనీ, రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదని రారు ఆరోపించారు. కార్మికులు నమోదు చేసుకుంటే, వారికి ప్రాథమిక హక్కులు మరియు సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు. ”మేము ఎల్‌ అండ్‌ టీ, దాని కాంట్రాక్టర్లచే నియమించబడిన కాంట్రాక్టు కార్మికులు” అని నిరసన తెలిపిన కార్మికుడు రాజు సింగ్‌ అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వందలాది మంది రైతులు తమకు పరిహారం చెల్లించాలంటూ రోజుల తరబడి నిరసనలు చేపట్టారు. 660 మెగావాట్ల రెండు యూనిట్లను కలిగి ఉన్న 1,320 మెగావాట్ల ప్లాంట్‌ను 1,283 ఎకరాల్లో సత్లుజ్‌ జల్‌ విద్యుత్‌ నిగమ్‌కు చెందిన పూర్తి అనుబంధ సంస్థ అయిన ఎస్‌జేవీఎన్‌ థర్మల్‌ ప్రయివేటు లిమిటెడ్‌ నిర్మిస్తున్నది. రాష్ట్ర ఇంధన శాఖ అధికారుల సమాచారం ప్రకారం.. రెండో యూనిట్‌ నిర్మాణం కేంద్రం యొక్క అతిపెద్ద ప్రాజెక్ట్‌. అయితే, బక్సర్‌ ప్లాంటులోని కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని యూనియన్లు సైతం మద్దతు తెలిపాయి.