కాల్షియం గని

Calcium mineనువ్వులు కాల్షియం గని. అవును నిజమే ఈ చిన్న విత్తనాల్లో పాలకంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఒక్క కాల్షియం మాత్రమే కాదు, వీటిల్లో ప్రొటీన్‌, ఫైబర్‌, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, మెగ్నీషియం, ఐరన్‌, జింక్‌ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల నువ్వుల్లో దాదాపు 975 మి.గ్రా. కాల్షియం ఉంటుంది. అయితే 100 మి.లీ. పాలలో 120-130 మి.గ్రా. కాల్షియం మాత్రమే ఉంటుంది. పాలలో ఉండే లాక్టోస్‌ను జీర్ణించుకోవడం చాలా మందికి కష్టం. కాబట్టి ఇలాంటి వారు పాలు తీసుకోలేరు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వులు వారికి ఓ వరమే. అంతేకాదు నువ్వులు సెసామోలిన్‌, సెసామిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లకు మూలం. ఇవి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. ఎముకలను బలోపేతం చేయాలనుకున్నా, భవిష్యత్తులో సప్లిమెంట్లను తీసుకోకూడదనుకున్నా.. మీరు తప్పనిసరిగా ఆహారంలో నువ్వులను చేర్చుకోవాలి. అలాగే ఇవి కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడంలో ముందుంటాయి. అధిక కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరేడ్లతో బాధపడేవాళ్లు తప్పనిసరిగా వీటిని తీసుకోవాలి. అలాగే హార్ట్‌ పేషెంట్లు కూడా నువ్వులను తీసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఇవి చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిల్ని తగ్గిస్తాయి. వీటిలో లిగన్స్‌, పైటోస్టెరాయిస్‌ వంటి సమ్మేళనాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో తోడ్పడతాయి. రోజూ 40 గ్రాముల నువ్వుల్ని తింటే చెడు కొలెస్ట్రాల్‌ 10 శాతం తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.