– రాష్ట్రపతికి కేరళ ముఖ్యమంత్రి లేఖ
తిరువనంతపురం: కేరళ గవర్నరు అరిఫ్ మహ్మద్ ఖాన్‌ను తక్షణమే వెనక్కి పిలవాలని (రీకాల్ చేయాలని) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి గురువారం ఆయన లేఖ రాశారు. యూనివర్సిటీ సెనేట్‌లను సంఘీయులతో నింపేయడం, శాసనసభ ఆమోదించిన బిల్లులపై సంతకం చేయకుండా తొక్కిపట్టడం వంటి చర్యల ద్వారా గవర్నరు కేరళ పాలిట విలన్ మాదిరి వ్యవహరిస్తున్నారు. ఇది కేరళ ప్రభుత్వానికి-రాజ్ భవన్‌కు మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. గవర్నరును రీకాల్ చేయాలన్న అసాధారణ స్థితికి అరిఫ్ మహ్మద్ ఖాన్ వైఖరే ముఖ్య కారణం. మిస్టర్ ఖాన్ ఈ మధ్య తీవ్ర పదజాలంతో ముఖ్యమంత్రిపై బహిరంగంగా దాడి చేశారు. గవర్నరు అనుచిత ప్రవర్తనపై రాష్ట్ర వ్యాపితంగా విద్యార్థులు నిరసనలకు దిగారు.
‘సావర్కర్ కాదు, గవర్నరు కావాలి’, ‘సంఘీ గవర్నరు గో బ్యాక్’ ‘మీ పప్పులు ఇక్కడ ఉడకవ్..దిసీజ్ కేరళ’ అన్న నినాదాలతో విశ్వవిద్యాలయ కేంపస్‌లు హౌరెత్తాయి. రాష్ట్ర నిధులతో నడిచే విశ్వవిద్యాలయాల సెనేట్‌లను సంఫ్ పరివార్ నామినీలతో నింపుతూ ఛాన్సలర్ హౌదాలో గవర్నరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. డిసెంబర్ 11న తిరువనంతపురంలో తన అధికారిక కారు నుండి దిగిన మిస్టర్ ఖాన్‌కు నల్ల జెండాలతో నిరసన తెలిపిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) కార్యకర్తలపై దురుసుగా వ్యవహరించారు. వారికి బహిరంగంగా సవాలు విసిరారు. ఆ తరువాత ముఖ్యమంత్రి విజయన్‌పై అవాకులు చవాకులు పేలారు. ”నాకు భౌతికంగా” హాని కలిగించేలా ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను ముఖ్యమంత్రి ప్రేరేపిస్తున్నారని బురదచల్లే యత్నం చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) క్రిమినల్స్ ఇష్టానుసారంగా చెలరేగిపోతున్నారని నిందించారు. డిసెంబర్ 16న, ఖాన్ మలప్పురంలోని కాలికట్ యూనివర్శిటీ క్యాంపస్ గెస్ట్ హౌస్ నుంచి ఎస్‌ఎఫ్‌ఐకి నేరుగా సవాల్ విసిరారు. దాంతో ఖాన్ ”వెనక్కి వెళ్ళాలి” అని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన చేపట్టింది. మిస్టర్ ఖాన్ సంఫ్‌ు పరివార్ చేతిలో పావులా వ్యవహరిస్తున్నారని, గవర్నరుకు, హిందూత్వ మెజారిటీ జాతీయవాద సిద్ధాంతకర్త సావర్కర్‌కు మధ్య సైద్ధాంతిక సారూప్యతను తెలియజేస్తూ కార్యకర్తలు క్యాంపస్ అంతటా బ్యానర్లు,పోస్టర్లు ప్రదర్శించారు. మిస్టర్ ఖాన్ ప్రోటోకాల్‌ను పదేపదే ఉల్లంఘిస్తున్నారు అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులను ఏళ్ల తరబడి తొక్కిపట్టడంపై సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టిన తరువాత కూడా ఆయన తీరు మారలేదు. అసెంబ్లీ ఆమోదించిన ఏడు బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపడం ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారు.
ప్రజలకు చేరువగా ఉండేందుకు కేబినెట్ నిర్ణయం మేరకు ప్రభుత్వం చేపట్టిన నవకేరళ సదస్సు హేతుబద్ధతను ప్రశ్నించే దాకా వెళ్లారు. రాష్ట్రాన్ని కించపరిచేలా అనుచిత భాష ఉపయోగించడంపై నిరసన తెలిపిన విద్యార్థులను నేరస్థులుగా చిత్రీకరించడం, కేరళలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యలకు పదే పదే పాల్పడుతుండడం వంటి గవర్నరు చర్యలను ముఖ్యమంత్రి ఆ లేఖలో సోదారహరణంగా వివరించారు. అంతకుముందు విజయన్ మాట్లాడుతూ, గవర్నరు ఖాన్ ”బహిరంగ పోకడలు, విధ్వంసకర ప్రకటనలు, రెచ్చగొట్టే చర్యలు రోజురోజుకీ మితిమీరుతుండడంతో ఆయనను రీకాల్ చేయాలని కోరడం మినహా మరో మార్గం లేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.