మరో మూడు ఎన్‌జీవోల ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సుల రద్దు

న్యూఢిల్లీ : తనకు గిట్టని ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జిఒ)లపై మోడీ ప్రభుత్వం ఈడి, ఐటిలతో దాడులు చేయించడంతోబాటు విదేశీ నిధుల (నియంత్రణ) చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ)ను కూడా ఒక సాధనంగా ప్రయోగిస్తున్నది. బిజెపి, ఆరెస్సెస్‌ల ఆదేశాలకు తలొగ్గని సంస్థలపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వం తాజాగా మరో మూడు ఎన్‌జిఒల ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్సులను రద్దు చేసింది. ఇడి, సిబిఐ, ఐటిల మాదిరిగానే ఎఫ్‌సిఆర్‌ఎను కూడా మోడీ ప్రభుత్వం పెద్దయెత్తున దుర్వినియోగపరుస్తున్నదని విమర్శలొస్తున్నాయి. ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్సులు రద్దయిన,లేదా లైసెన్సు పునరుద్దరించని ఎన్‌జిఓల జాబితా భారీగా పెరుగుతోంది. మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన 2019 తరువాత నుంచి మూడేళ్లలో 1,811 సంస్థల లైసెన్సులు రద్దయ్యాయి. మొత్తంగా గత 10 ఏళ్లలో 20,600 ఎన్‌జిఒలు ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్సులను కోల్పోయాయి.
ఢిల్లీలోని యంగ్‌ ఉమెన్స్‌ క్రిస్టియన్‌ అసోసియేషన్‌ (వైడబ్ల్యూసిఎ)తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న సిఎన్‌ఐ శిశు సంగోపన్‌ గృహ, ప్రోగ్రామ్‌ ఫర్‌ సోషల్‌ యాక్షన్‌ (పిఎస్‌ఎ) అనే మూడు ఎన్‌జిఓలు తమ ఎఫ్‌ఆర్‌సిఎ అనుమతులును కొల్పోయాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జూన్‌ చివరిలో జరిపిన సమీక్షలో వీటి అనుమతులను రద్దు చేసింది. ఈ ఎన్‌జిఓలు చిన్నారులు, మహిళలు సంక్షేమం కోసం పాటుపడడంతోబాటు, బాలికలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఎఫ్‌సిఆర్‌ఎలోని సెక్షన్‌ 16(1), సెక్షన్‌ 12(4)(బి)లను సాకుగా చూపుతూ, వీటి అనుమతులు రద్దు చేశారు. నిజానికి ఈ సెక్షన్లు తీవ్రమైనవి కావు. అనుమతుల కోసం సకాలంలో దరఖాస్తు చేయాలని ఈ సెక్షన్లు చెబుతున్నాయి. వీటిని చూపి హోం శాఖ అనుమతులు రద్దు చేసింది. అయితే తాము సకాలంలోనే దరఖాస్తులు చేసామని మూడు సంస్థలు చెబుతున్నాయి.