తగ్గుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

న్యూఢిల్లీ : తాజా గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో పౌర ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య 30.13 లక్షలు. 2010 తర్వాత పౌర ఉద్యోగుల సంఖ్య ఇంత కనిష్ట స్థాయిలో ఉండడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం కేంద్రంలో మంజూరై ఉన్న పోస్టుల సంఖ్య 39.77 లక్షలు. గత మూడు సంవత్సరాలలో మంజూరైన పోస్టుల సంఖ్యను పరిశీలిస్తే ఇది కూడా చాలా తక్కువే. ప్రస్తుతం 9.64 లక్షల కేంద్ర ప్రభుత్వోద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ వివరాలను పొందుపర్చారు. 2021 మార్చి, 2022 మార్చి మధ్య కాలంలో మంజూరైన పోస్టుల సంఖ్య 40.35 లక్షల నుండి 39.77 లక్షలకు తగ్గిపోయింది. గ్రూప్‌ సీ పోస్టుల సంఖ్యను తగ్గించడమే దీనికి కారణం. ఇదే కాలంలో ఉద్యోగుల సంఖ్య కూడా 30.56 లక్షల నుండి 30.13 లక్షలకు తగ్గిపోయింది. రైల్వేలు, రక్షణ (పౌర), హోం వ్యవహారాలు, తపాలా, రెవెన్యూ శాఖలలో ఉద్యోగాల మంజూరు, ఉద్యోగుల సంఖ్య తక్కువగానే ఉంది.

Spread the love