పోలింగ్  సరళిపై లెక్కలు కడుతున్న అభ్యర్థులు..

– కూడికలు తీసివేతలలో నేతలు నిమగ్నం, గెలుపుపై ఎవరి ధీమా వారిదే, విజయోత్సవ ర్యాలీ ఏర్పాట్లలో కాంగ్రెస్, బీజేపీ,
– 25 వేల మెజార్టీ ఖాయం…బీఆర్ఎస్
రేపు కౌంటింగ్, జిల్లాలో ఉత్కంట.
నవతెలంగాణ – సూర్యాపేట
శాసనసభ ఎన్నికలలో జరిగిన పోలింగ్ సరళిపై అభ్యర్థులు దృష్టిసారించారు. గత మూడు వారాలుగా అలు పెరుగని ప్రచారం అనంతరం గురువారం జరిగిన పోలింగ్ తో శాసన సభ ఎన్నికలు ముగిసిన విషయం విదితమే. ఈ క్రమంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బిఎస్పి పార్టీల అభ్యర్థులు ఓటింగ్ పై లెక్కలు కడుతున్నారు. తమకు  ఏ పోలింగ్ కేంద్రంలో ఎన్ని ఓట్లు పడతాయనే దానిపై విశ్లేషిస్తున్నారు.కాగా పోలింగ్ సరళి అభ్యర్థుల్లో టెన్షన్ పెంచుతుంది. ఈ క్రమంలోనే అభ్యర్థులు  కూడికలు, తీసివేతలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇది గాక గతంలో కంటే ఈసారి జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని 4 శాసనసభ నియోజకవర్గాలలో కొన్నిచోట్ల పోలింగ్ శాతం పెరిగగా ఇంకొన్ని చొట్ల తగ్గింది.ఈసారి జిల్లాలో 85.99 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటును భారీ ఎత్తున సద్వినియోగం చేసుకున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని సూర్యాపేటలో మొత్తం 241799 ఓటర్లు ఉండగా అందులో 203624  ఓట్లు పోలయ్యాయి. దీంతో దాదాపుగా 84.21 శాతం పోలింగ్ నమోదైంది. కాగా గత 2014లో 79.98 శాతం ఉండగా 2018 లో 87.08 రాగ ఈసారి 84.21  శాతంతో పోలింగ్ 3 శాతం తగ్గింది. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలో మొత్తం 255017 ఓట్లు ఉండగా 223496  పోలింగ్ అయ్యాయి. ఇందులో 87.63  శాతం నమోదైంది. 2014లో 78.05 ఉండగా 2018 లో 86.33 శాతం నమోదు కాగా ఈసారి 87.63 శాతం తో  పోలింగ్ పెరిగింది. అదేవిధంగా కోదాడలో మొత్తం 241554 ఓట్లు ఉండగా 206676  పోలింగ్ అయ్యాయి. మొత్తంగా 85.56 శాతంగా నమోదయింది. 2014లో 85.09 శాతం ఉండగా 2018 లో 89.44 రాగ ఈసారి 85.56 పోలింగ్ తో 4 శాతం తగ్గింది. అదేవిధంగా హుజూర్నగర్ లో మొత్తం 247592 ఓట్లకు గాను 214012 పోలయ్యాయి. ఇందులో 2014 లో 81.54 శాతం ఉండగా 2018 లో 86.94 రాగ ఈసారి 86.43 శాతం పోలింగ్ సమానంగా వచ్చింది. కాగా జిల్లావ్యాప్తంగా 85.99  శాతం పోలింగ్ నమోదయింది. ఈ క్రమంలో సూర్యాపేట నియోజకవర్గంలో గతంలో కంటే 3 శాతం పోలింగ్ తగ్గింది. ప్రతి ఎన్నికల్లో కూడా ఇక్కడ అభ్యర్థుల గెలుపోటములను పట్టణ ఓటర్లే  నిర్ణయిస్తారు. మరి ఈసారి పట్టణంలో భారీగా ఓట్లు పోల్ కావడంతో అవి ఏ పార్టీ వైపు పడ్డాయనే ఆందోళన అభ్యర్థులో నెలకొంది.బిఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి, బిజెపి అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర రావు,బిఎస్పి అభ్యర్థి జానయ్య యాదవ్ లు నియోజక వర్గంలో పోలైన ఓట్ల పై సమీక్షలు జరుపుతున్నారు. ఎక్కడెక్కడ తమకు ఓట్లు పడ్డాయనే దానిపై విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో గెలుపోటములను శాసించే పట్టణ ఓటర్లపై ఈసారి బి.ఆర్.యస్, బీజేపీ అభ్యర్థులు దృష్టిసారించారు. ఇరు పార్టీలు కూడా ఓటర్లకు భారీగా పోటీపడి తాయిలాలు చేరవేశారు. ఒకరకంగా వీరిద్దరి మధ్య డబ్బుల పంపిణీ లో నువ్వా నేనా అనే రీతిలో పోటీ నడిచింది. ప్రధానంగా పోలింగ్ ప్రారంభం నుండి ఒంటి గంట వరకు బి.ఆర్.యస్, బీజేపీ పార్టీల మధ్య ఓట్ల పోటీ నడిచింది. ఈ క్రమంలో ఉదయం పూట కాంగ్రెస్ పార్టీకి ఓట్లు మందగించాయనే  చర్చ  నడిచింది. ఈ క్రమంలోనే బి.ఆర్.యస్, బిజెపి పార్టీ ల తాయిలాలు కొంత మంది ఓటర్లకు అందకపోవడంతో మధ్యాహ్నం వరకు వాటి కోసం ఎదురు చూసిన వారంతా చేసేది లేక తర్వాత ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో రాత్రి వరకు కొనసాగిన పోలింగ్ తో కొంత మంది ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో కూడా అభ్యర్థుల గెలుపోటములపై రకరకాలుగా అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ప్రధానంగా బి.ఆర్.యస్,కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యనే పోరు నడిచిందని వీరిలో ఎవరో ఒకరు గెలుస్తారనే చర్చ సాగుతుంది. మరి కొంత మంది మాత్రం బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఉందని వీరిలో పట్టణంలో ఎవరికి ఎక్కువగా ఓట్లు పడతాయో వారే విజేత అని పలు కూడళ్లలో చర్చించు కుంటున్నారు.కాగా బిఎస్పి అభ్యర్థి ఎవరి ఓట్ల ను చీల్చాడో అనే టెన్షన్ ప్రధాన అభ్యర్థులో నెలకొంది.ఇదిలా ఉండగా పట్టణ కేంద్రంలో ఎవరికి ఎక్కువగా ఓట్లు పడ్డాయనే దానిపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. బి.ఆర్.యస్, బీజేపీ వర్గాలు మాత్రం అధికంగా ఓట్లు తమకే పడ్డాయని గెలుపు  ధీమాలో వారు ఉన్నారు. కాగా పట్టణంలో సైలెంట్ గా కాంగ్రెస్ కే ఓట్లు పడ్డాయని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.కాగా బి.ఆర్.యస్, బిజెపి అందించిన తాయిలాలు అందని వారు మాత్రం కాంగ్రెస్  కె ఓటు వేశారనే ధీమా ను ఆ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ రకంగా ప్రజలతో పాటు రాజకీయ నాయకులు గెలుపోటములపై ఓటింగ్ పై విశ్లేషణలు జరుపుతుండగా అభ్యర్థులు మాత్రం ఎవరికి వారే గెలుపు ధీమాలో ఉన్నారు. ఇందులో ప్రధానంగా మంత్రి బిఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి మాత్రం 25 వేల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర్ రెడ్డి విజయంపై హండ్రెడ్ పర్సెంట్ ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన అభిమానులు పోలింగ్ జరిగిన రాత్రి ఆనందోత్సవాలు జరుపుకున్నారు. 3 వ తేదీన ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీ ఏర్పాట్లలో ఉన్నారు. అదేవిధంగా దామోదర్ రెడ్డి కూడా ఎంతో హుషారుగా ఉండడంతో ఆయన అభిమానుల్లో మరింత ధీమా పెరిగింది. ఇదిలా ఉండగా బిజెపి అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు విజయం ఖాయమైందని ఈనెల 3 న విజయోత్సవ ర్యాలీ ఉన్నదని పేర్కొంటూ ఆయన వర్గీయులు వాట్సాప్, ఫేస్ బుక్ లో పోస్టింగులు పెట్టారు. ప్రధానంగా సంకినేని మాత్రం పట్టణంలో పోలింగ్ శాతం పెరిగిందని అది తనకి అనుకూలమని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ రకంగా కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు మాత్రం విజయంపై హండ్రెడ్ పర్సెంట్ తో ఉండగా బిఆర్ఎస్ అభ్యర్థి మాత్రం పథకాలే తన గెలుపుకు నాంది అంటూ గుంభనంగా ఉంటున్నారు. కాగా కాంగ్రెస్, బిజెపి పార్టీలు మాత్రం విజయోత్సవ  ర్యాలీలు చేయడానికి దూకుడు ప్రదర్శిస్తున్నాయి.ఆ పార్టీ అభిమానులు  వేర్వేరుగా ఆనందోత్సవాలతో జిల్లా కేంద్రంలో చక్కర్లు కొడుతున్నారు.బిఆర్ఎస్ అభిమానులు మాత్రం మండల, గ్రామాల్లో ఓట్లు వన్ సైడ్ పడ్డాయని, గెలుపు తమదే అనే ధీమాలో ఉన్నారు. ఇకపోతే పట్టణంలో ఎవరికి ఎన్ని ఓట్లు, ఏ విధంగా, ఏ రకంగా పడి ఉంటాయో అనే దానిపై అభ్యర్థులు బేరీజు వేసుకుంటున్నారు. ఈ రకంగా ముగ్గురిలో కూడా ఎక్కడ కూడా బాధ  కనిపించడం లేదు.ముగ్గురిలో కూడా ఎవరికి వారే మంచి జోష్ లో విజయంపై హుషారుగా ఉన్నారు. మరి ఓటర్లు మాత్రం ఎవరికి పట్టం కట్టనున్నారో అనేది ఈవీఎంలో నిక్షిప్తమైంది.నేడు ఓట్ల లెక్కింపు తో “సూర్యాపేట బాదుషా” ఎవరనేది తేల నున్నది.