మరో 33 స్థానాలకు అభ్యర్థులు

sonia gandhi and mallikarjun kharge– కాంగ్రెస్‌ సీఈసీ నిర్ణయం
– మిగిలిన స్థానాలపై నేడు మరోసారి భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మరో 33 స్థానాలకు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ జాబితా గురువారం ఉదయం విడుదల చేసే అవకాశం ఉంది. వీటితో పాటు మిగిలిన స్థానాలపై కూడా స్పష్టత వచ్చిన తరువాత మొత్తం స్థానాలకు సంబంధించిన జాబితా విడుదల చేయనుంది. బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సీఈసీ భేటీ అయింది. ఈ భేటీలో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌, స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌, కమిటీ సభ్యులు మాణిక్‌ రావు ఠాక్రే, రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క,ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జిగేశ్‌ మేవానీ సహా ఇతర స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12:45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ భేటీ సాగింది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపై ఈ భేటిలో కీలకంగా చర్చించారు. అయితే ఈ భేటిలో దాదాపు 33 స్థానాలపై స్పష్టత వచ్చింది. కాగా మొత్తం 119 స్థానాలకు గాను ఈనెల 15న 55 స్థానాలకు అభ్యర్థులతో కూడిన మొదటి జాబితా విడుదల చేశారు. ప్రస్తుతం మరో 33 స్థానాలతో, మొత్తం 88 స్థానాలపై స్పష్టత వచ్చినట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. మిగిలిన 31 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు నేడు (గురువారం) ఉదయం 10 గంటలకు సీఈసీ భేటీ కానుంది. ఇదిలా ఉంటే బుధవారం సాయంత్రం కేసీ వేణుగోపాల్‌ నివాసంలో స్క్రీనింగ్‌ కమిటీ భేటి అయింది. ఈ 22 స్థానాలపై నేతలు చర్చించి, తుది జాబితాను తయారు చేసినట్లు సమాచారం.
అబద్దాలు, దోపిడీ, కమీషన్‌ తప్ప
చేసిందేమీ లేదు…: ఖర్గే
తెలంగాణ మార్పునకు సిద్ధమైందని, ప్రజలు కాంగ్రెస్‌ ను ఎన్నుకునేందుకు సిద్ధమయ్యారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్‌(ఎక్స్‌)లో సీఈసీ మీటింగ్‌ వీడియోతో కలిపి ఒక పోస్ట్‌ పెట్టారు. ఓటమి ఖాయం కావడంతో బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ పార్టీపై నిరంతరం దాడులు చేస్తూ… తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం లు నేరాల్లో భాగస్వాములని విమర్శించారు. అబద్ధాలు, దోపిడి, కమీషన్లు తప్ప తెలంగాణ ప్రజలకు ఆ పార్టీలు చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు తెలంగాణలో న్యాయం, సంక్షేమం, పురోగతికి బాటలు వేస్తాయన్నారు. సీఈసీ మీటింగ్‌ లో తెలంగాణకు సంబంధించిన కీలక చర్చ జరిగిందని వెల్లడించారు.