23న ఇండియా గేట్‌ వద్ద క్యాండిల్‌ మార్చ్‌

18 రాష్ట్రాల అంగన్‌వాడీ నేతలు మద్దతు
 రాష్ట్రపతి లక్షలాది మెయిల్స్‌, పోస్టు కార్డులు
 ఐపీఎల్‌ మ్యాచ్‌ చూసేందుకు వెళ్లిన రెజ్లర్లను అడ్డుకున్న పోలీసులు
న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లు ఈ నెల 23న సాయంత్రం నాలుగు గంటలకు ఇండియాగేట్‌ ప్రాంగణంలో క్యాండిల్‌లైట్‌ మార్చ్‌కు పిలుపునిచ్చారు. జంతర్‌ మంతర్‌వద్ద రెజ్లర్ల ఆందోళన శనివారం 28వ రోజు పూర్తి చేసుకుంది. బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలని రైతులు, ఆందోళనకారులు పోలీసులకు ఇచ్చిన అల్టిమేటం ఆదివారంతో ముగియనుంది. ఆయనను అరెస్టు చేయని నేపథ్యంలో నేడు (ఆదివారం) కఠిన నిర్ణయం ప్రకటిస్తామని రెజ్లర్లు తెలిపారు. దేశానికి ఇబ్బంది కలిగించే ప్రకటన ఉంటుందని వినేష్‌ ఫోగట్‌ మీడియాతో చెప్పారు.
రైతు సంఘాలు, ఖాప్‌ నేతల భాగస్వామ్యంతో ఆదివారం సమరవీధిలో జరిగే మహా పంచాయతీలో ఢిల్లీని దిగ్బంధం చేస్తామని ప్రకటించారు. 21వ తేదీలోగా అరెస్టులు చేయకుంటే ఢిల్లీని ముట్టడిస్తామని భారతీయ కిసాన్‌ యూనియన్‌, ఆర్‌ఎల్‌డీ గతంలోనే ప్రకటించాయి. హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌, యూపీ రాష్ట్రాలకు చెందిన రైతులు నేడు జంతర్‌ మంతర్‌ చేరుకోనున్నారు. రైతుల ఆందోళన తరహాలోనే ఢిల్లీ సరిహద్దుల్లో నిరవధిక దిగ్బంధనానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అఖిల భారత అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో 18 రాష్ట్రాల కార్యకర్తలు శనివారం నిరసన స్థలానికి చేరుకుని సంఘీభావం ప్రకటించారు. ఫెడరేషన్‌ అధ్యక్షురాలు ఆశారాణి, ప్రధాన కార్యదర్శి ఏఆర్‌ సింధు మాట్లాడారు. బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ సాక్షి మాలిక్‌తో సహా రెజ్లర్లు ఎస్‌ఎఫ్‌ఐ నేతృత్వంలో రాష్ట్రపతికి లేఖ పంపారు. లక్షలాది ఈమెయిల్‌లు, లేఖలు పంపడంతో ఇప్పటికే మంచి స్పందన వచ్చిందని, పలువురు ప్రముఖ క్రీడా ప్రముఖులు కూడా తమకు సంఘీభావం తెలిపారని ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూక్‌ బిస్వాస్‌ తెలిపారు.
స్విమ్మింగ్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బంగారు పతక విజేత బులా చౌదరి, ఫుట్‌బాల్‌ మాజీ కెప్టెన్‌ కుంతల ఘోషదస్తిదార్‌, మాజీ జాతీయ క్రికెట్‌ సెలెక్టర్‌ సంబరన్‌ బెనర్జీ, మాజీ క్రికెటర్‌ ఉత్పల్‌ ఛటర్జీ, ఫుట్‌బాల్‌ మాజీ కెప్టెన్‌ భాస్కర్‌ గంగూలీ, ఫుట్‌బాల్‌ మాజీ క్రీడాకారుడు తుషార్‌ రక్షిత్‌, స్విమ్మర్‌ సయానీ దాస్‌ రెజ్లర్లకు సంఘీభావం తెలిపిన ప్రముఖ క్రీడాకారుల్లో ఉన్నారు. శిరోమణి గురుద్వారా పరబంధక్‌ కమిటీ కూడా రెజ్లర్ల ఆందోళనకు మద్దతు ప్రకటించింది.
కాగా, ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియంలో శనివారం సాయంత్రం జరిగిన ఐపిఎల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు పోలీసులు తమను అనుమతించ లేదని సాక్షి మాలిక్‌, వినీషా ఫోగట్‌, బజరంగ్‌ పునియా విమర్శించారు. క్రీడాకారులు స్టేడియం వెలుపల నిరసన తెలిపారు.