తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రవేశించి నటనతో మెప్పించి తనకుంటూ ఓ విలక్షణమైన గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో రూప ఒకరు. టాలీవుడ్ అమ్మగా…అమ్మ పాత్రలకు కేరాఫ్‌గా ఆమె నిలుస్తున్నారు. ఇటీవల వస్తున్న ఎక్కువ సినిమాల్లో తల్లిపాత్రల్లో ఆమె పేరే వినబడుతోంది. చక్కటి అందం..చెదరని చిరునవ్వు… స్పష్టంగా ఉండే మాటతీరు… సడలని ఆత్మవిశ్వాసంతో నిండుగా కనిపించే ఆమె పరిచయం నేటి మానవిలో…
రంగుల కల సినిమా రంగంలో ఎవ్వరికీ అంత తేలికగా అవకాశాలు రావు. దానికి నటనలో నిపుణుత ఉండాలి. ఎంతో కష్టపడాలి. బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. ఇండిస్టీలో తెలిసిన వారుండాలి. అలాంటిది ఎలాంటి బ్రాక్‌గ్రౌండ్ లేకుండానే టాలీవుడ్‌లో రాణిస్తున్నారు వైష్ణవిశ్రీ రూపలక్ష్మి. అయితే ఆమెకు అవకాశాలు ఊరకే రాలేదు. షూటింగ్ ఉందని పిలిచి గంటల తరబడి వేచివుండమని చెప్పి ఆ తర్వాత వెళ్లిపొమ్మన్న సంఘటనలు కూడా ఉన్నాయి. ‘నటన వచ్చా.. నటించగలదా?..చూద్దాంలే’ అనే నిట్టూర్పులు విడిచిన వారూ ఉన్నారు. కొన్ని సినిమాల్లో నటించాక కూడా ఆడిషన్స్‌కు రావాలని కోరిన ఘటనలు కోకొల్లలు. అయితే ఇవేవీ ఆమె పట్టించుకోలేదు. మొదట్లో ఏదో మొక్కుబడిగా నుంచుని వెళ్లిపోయే చిన్న పాత్రలకే పరిమితం చేసినా భరించారు. నమ్మిన సినిమా రంగంలో ఆర్టిస్టుగా రాణించాలనే చిన్ని ఆశే ఆమెను ‘బలగం’ సినిమా ద్వారా నేడు టాలీవుడ్‌లో మంచి నటిగా నిలబెట్టింది.
కుటుంబ నేపథ్యం
చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన రూపలక్ష్మి తల్లిదండ్రులది వ్యవసాయ కుటుంబం. సొంత తల్లిదండ్రులు గోపాలనాయుడు, నాగమ్మ. పెంచిన తల్లిదండ్రులు వైష్ణవిశ్రీ, సీతారామ్. రెండు నెలల వయసులోనే ఆమెను ఓ ఎకనామిక్స్ లెక్చరర్‌కు దత్తత ఇచ్చేశారు. అక్కడ పెరిగిన ఆమెకు యుక్తవయస్సు రాగానే పెండ్లి చేశారు.
‘మదర్’ ఫేమ్‌కు కేరాఫ్
అందం, అభినయమే కాదు, ఆత్మవిశ్వాసంతో తనకు నచ్చిన, మెచ్చిన, వచ్చిన పాత్రల్లో తల్లిగా నటిస్తూ మెప్పిస్తున్నారు. టాలీవుడ్‌లో హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రల్లో నటిస్తూ తెలుగు పరిశ్రమలోనే నేడు బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్నారు. దూరదర్శన్, ఈటీవీ సీరియళ్లలో బుల్లితెరపై నటిగా మెప్పించి, షార్ట్‌ఫిలిమ్స్‌లో రాణించిన ఆమె వెండితెరపైనా తన అభినయాన్ని పండిస్తూ ‘బలగం’ ద్వారా మంచి నటిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
బుల్లితెరలోనూ మెప్పించారు
చిన్నప్పటి నుంచే రూపకు సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా ఉంది. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అద్దం ఎదురుగా డ్యాన్సులు చేయటం, డైలాగులు చెప్పటం ప్రాక్టీస్ చేసేవారు. సెలవు రోజుల్లో సినిమాలు బాగా చూసేవారు. ఆ తర్వాత తమ్ముడి స్నేహితుడి ద్వారా వచ్చిన అవకాశాలతో ఓ టీవీ ఛానల్లో పలు ధారావాహిక కార్యక్రమాల్లో నటించారు. పలు షార్ట్‌ఫిలిమ్స్‌లో అనేక పాత్రలను పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు. వీటి ద్వారా వచ్చిన పరిచయాలతో సినిమాల్లో మొదట్లో ఇలా కనిపించి అలా వెళ్లిపోయే పాత్రలకు అవకాశం వచ్చింది.
కామెడీ పంచులను కూడా
జయ జానకి నాయక, వినయ విధేయ రామ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తదితర సినిమాల్లో రూప ఎక్కువ నిడివి ఉన్న పాత్రలను పోషించారు. ఆయా పాత్రల్లో ఆమె నటించి మెప్పించారు. పలు సందర్భాల్లో కామెడీని సైతం పండించారు. శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘నీది నాది ఒకటే కథ’లోనూ తల్లి పాత్రలో ఆమె డైలాగులు ఆలోచింపజేస్తాయి. కామెడీ పంచులను కూడా ప్రేక్షకులు ఆదరించారు. జాంబిరెడ్డి, సరిలేరు నీకెవ్వరు, మహర్షి, నర్తనశాల, టెన్త్‌క్లాస్ డైరీస్ వంటి చిత్రల్లో ఆమె పాత్రకు పేరొచ్చింది. హరీష్ శంకర్, బోయపాటి శ్రీనివాసరావు వంటి అగ్ర దర్శకులు పలు సినిమాలకు అవకాశం వచ్చేలా చేశారు.
బలాన్నిచ్చిన ‘బలగం’
తెలుగు సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించిన ‘బలగం’ చిత్రం ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టింది. తెలంగాణాలోని గ్రామీణ ప్రాంతాల్లోని కథను ఓ కుటుంబం పెద్ద దిక్కు మరణాన్ని ఇతివృత్తంగా చేసుకుని సినిమా సాగుతుంది. అంత్యక్రియలు, దశదినకర్మ, పిట్టకు పిండం పెట్టడం, ఆత్మీయుల మధ్య సాగే కలహాలు, అనుబంధాలు, మనస్పర్ధలు, భావోద్వేగాలు వంటి అంశాల్లో ప్రతి సందర్భంలోనూ ఆమె పాత్రలో ఒదిగిపోయి నటించారు. సందేశాత్మకంగానూ, హాస్యపూరితంగానూ ఎమోషనల్ కామెడీ గ్రామాకు సాగుతుందీ సినిమా. హీరోగా ప్రియదర్శి (సాయిలు), హీరోయిన్‌గా కావ్య కళ్యాణ్‌రామ్ (సంధ్య) నటించారు. మరణించిన తండ్రి కొమరయ్య (సుధాకర్‌రెడ్డి)కి కూతురిగా రూపలక్ష్మి (లక్ష్మి) పాత్రలో జీవించేశారు. ముఖ్యంగా తండ్రి కొమరయ్య శవానికి చివరగా స్నానం చేయించే సీన్‌లో భౌతికాయాన్ని హత్తుకుని ఏడ్చేసీన్ ప్రేక్షకులకు సైతం కన్నీళ్లు తెప్పించింది. రూప అందులో అంతగా ఒదిగిపోయారంటే అతిశయోక్తి కాదు. దర్శకుడు ఈ సీన్ చెప్పకపోయినా ఇది ఉంటే బాగుంటుందని ఆమె చెప్తే అంగీకరించారు. హీరోయిన్‌కు తల్లిగా, హీరోకు మేనత్తగా ప్రతిసందర్భంలోనూ ఆమె పాత్రలో ఒదిగిపోయారనే చెప్పొచ్చు. దర్శకుడు వేణు యెల్దండి ఇచ్చిన రోల్‌కు ఆమె వంద శాతం న్యాయం చేశారు.
పాత్ర ఏదైనా తనదైన ముద్ర
పల్లెటూరి అమ్మాయిగా మాస్ రోల్‌లోనైనా, సిటీ యువతిగా లేటెస్ట్ ట్రెండ్‌తో ఆకట్టుకునేలానూ, అమ్మతనానికి వన్నెతెచ్చేలా మెప్పిస్తున్నారు. భాషలు, యాసల్లో మాట్లాడుతూ సీరియళ్లలో చెల్లెలు, అక్క, విలన్ పాత్రలు పోషించారు. చిన్న హీరోల నుంచి నేడు పెద్ద హీరోలకు తల్లి పాత్రల్లో నటించే వరకు ఎదిగారు. జ్ఞాపకశక్తి, ఏది చెప్పినా ఇట్టే పట్టేసే తత్వం ఆమెలో ప్రత్యేకత. తన పుట్టిన పల్లెల్లో ఉండే కుటుంబ నేపధ్యం, సంప్రదాయాలు, ప్రేమానురాగాలను తన పాత్రల్లో పండిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పటి వరకు 50కిపైగా సినిమాల్లో నటించారు.
రాబోయే సినిమాలు
కరుణాకరణ్ దర్శకత్వంలో వస్తున్న మట్కా, ఎన్టీఆర్ నటిస్తున్న దేవర, నాగార్జున ‘నా సామిరంగ’ వంటి పలు తాజాగా సినిమాల్లో ఆమె నటిస్తున్నారు. మరికొన్ని సినిమాల్లో కూడా నటించబోతున్నారు.
ఆత్మ విశ్వాసంతో ముందుకు
కెరీర్ పరంగా సినిమాల్లో ఎలాంటి ఛాలెంజింగ్ పాత్రలు వచ్చినా చేయటానికి సిద్ధంగా ఉన్నాను. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించాలని వుంది. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను. పెద్ద హీరోలకు తల్లి పాత్రల్లో నటించాలని అవకాశాలు వస్తున్నాయి. కష్టాలను ఎదిరించా. ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నా. ఆత్మవిశ్వాసంతోనే ముందుకు సాగుతున్నా. జీవితంలో మహిళ సంతృప్తిగా ఉండే స్థానం అమ్మ.. అందుకే అలాంటి పాత్రల్లో నటిస్తున్నాను.
– వి.ఎస్. రూపలక్ష్మి
సంభాషణ : యడవల్లి శ్రీనివాసరావు