పోడు రైతులపై కేసులు రద్దు…

– గిరిజన లబ్దిదారులకు పోడు పట్టాలు పంపిణీ
– కుమురంభీం-ఆసిఫాబాద్‌లో ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
– రాష్ట్రంలో 4లక్షల ఎకరాలకు పట్టాలతోపాటు రైతుబంధు
– 75ఏండ్లు సాగులో ఉన్నట్టు ఆధారాలు చూపితే గిరిజనేతరులకూ పట్టాలు
– గిరిజన గూడేలు.. తండాలకు త్రీఫేజ్‌ విద్యుత్‌ సౌకర్యం
– ధరణి పోతే పైరవీకారులు దోచుకుంటారని వ్యాఖ్య
– సమీకృత కలెక్టర్‌ కార్యాలయం ప్రారంభం
రాష్ట్రంలో 4లక్షల ఎకరాలకు పోడు పట్టాలు అందిస్తున్నాం.. ఈ ప్రక్రియ కుమురంభీం జిల్లా నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉంది. కుమురంభీం-ఆసిఫాబాద్‌ జిల్లాలో 47వేల ఎకరాలకు పోడు పట్టాలు అందజేస్తున్నాం.. అవి కూడా మహిళల పేరున ఇస్తున్నాం.. పట్టాలతోపాటు రైతుబంధు నిధులు కూడా జమ చేస్తాం.. పోడు లబ్దిదారులకు పట్టాలు ఇచ్చాక కూడా వారిపై కేసులు ఉంటే బాగుండదు.. ఆ కేసులన్నీ ఎత్తేస్తాం.. ఇకపై వారిపై ఎలాంటి కేసులూ ఉండవు.. మరోపక్క పొలాలకు రూ.300కోట్లతో త్రీఫేజ్‌ విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తాం..”
– ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
శుక్రవారం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రానికి వచ్చిన ముఖ్యమంత్రి నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనం, బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్‌లో లబ్దిదారులకు పోడుపట్టాల పంపిణీ చేశారు. అలాగే, పలువురికి రైతుబంధు చెక్కులు ఇచ్చారు. ఈ సందర్భంగా గిరిజనేతరుల గురించి స్పందిస్తూ.. 75 సంవత్సరాలుగా పోడు భూముల్లో సాగులో ఉన్నట్టు ఆధారాలు చూపిస్తే వారికీ త్వరలో పట్టాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. అలాగే, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగుల సహకారాన్ని గుర్తుచేసి.. అభినందించారు. అంతకు ముందు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్‌ సాయిచంద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
గతంలో మంచం పట్టిన మన్యం అనే వార్తలు వచ్చేవని..భగీరథ నీరు వచ్చిన తర్వాత ఆ సమస్య లేకుండా పోయిందని తెలిపారు. మన్యం వీరుడు కుమురంభీం పేరుతో ఆసిఫాబాద్‌ జిల్లా ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో 24గంటలపాటు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని చెప్పారు. అటవీ.. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు, గిరిజన బిడ్డల పొలాలకు రెండు మూడు నెలల్లోనే రూ.300 కోట్లు ఖర్చుపెట్టి త్రీఫేజ్‌ కరెంట్‌ అందజేస్తామని చెప్పారు. దేశంలో సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రమే మొదటి స్థానంలో ఉందని తలసరి ఆదాయం, శుభ్రమైన మంచినీరు, కేసీఆర్‌ కిట్‌, రైతుబంధు తదితర పథకాలు ఇక్కడే అమలవుతున్నాయని వ్యాఖ్యానించారు. ధరణి పుణ్యంతో రైతుబీమా రూ.5లక్షలు చెక్కు రూపంలో ఇంటికే వస్తుందన్నారు. రైతుబంధు ఖాతాల్లో పడుతోందని చెప్పారు. ధరణిని తీసేస్తామని కాంగ్రెస్‌ చెబుతోందని, ధరణి లేకపోతే పైరవీకారులు బలవంతంగా భూములు దోచుకుంటారని అన్నారు. ధరణిపోతే రైతుబంధు ఎలా వస్తుందని, వడ్ల పైసలు ఎలా పడతాయని, వీటి కోసం షావుకారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం కోసమే రైతుబంధు తీసుకొచ్చామని వివరించారు. ఈ పథకాలు చూసి మహారాష్ట్రలోని సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని.. అక్కడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారని వివరించారు. తన ప్రాణం పోతుందని తెలిసినా తెలంగాణ కోసం పోరాటం చేశానని, పేదలే దేవుళ్లుగా పని చేస్తున్నామని చెప్పారు. గురుకులాల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులు ఎంబీబీఎస్‌, ఇంజినీరింగ్‌ వంటి కోర్సుల్లో సీట్లు సాధిస్తున్నారని తెలిపారు. దళిత, గిరిజన, ముస్లిం మైనార్టీ తరగతుల బిడ్డలు అభివృద్ధి సాధించేందుకు దోహదం చేస్తున్నామన్నారు. అందుకే రాబోవు ఎన్నికల్లోనూ వందశాతం మనమే గెలుస్తున్నాం.. తెలంగాణ రాష్ట్రాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దుకుందామని వ్యాఖ్యానించారు.
వరాల జల్లు
ఆసిఫాబాద్‌ జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలకు ఒక్కో దానికి రూ.10లక్షల చొప్పున, కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలకు రూ.25కోట్ల చెప్పున మంజూరు చేస్తున్నామని.. మంచిర్యాల జిల్లాలోనూ ఏడు మున్సిపాలిటీలకు రూ.25కోట్లు, 311 పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. దేశంలో 20గ్రామ పంచాయతీలకు అవార్డులు వస్తే అందులో 19 గ్రామాలు తెలంగాణలోనివేనని తెలిపారు. కౌటాల నుంచి మహారాష్ట్ర వెళ్లేందుకు వార్దా నదిపై రూ.75కోట్లతో వంతెన మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన జీఓను కూడా ఎమ్మెల్యే కోనప్పకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌అలీ, మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, కుమురంభీం జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మీ, సిర్పూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడి అటవీ ప్రాంతాల్లో పర్యటించానని.. అనేక దశాబ్దాలుగా ఇక్కడి గిరిజనులు మాననాటే.. మావరాజ్‌(మాఊళ్లో..మారాజ్యం) నినాదంతో పోరాటం చేసినా సాధ్యం కాలేదని తెలిపారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 4వేల గూడేలు, తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో ఇది సాధ్యమైందని చెప్పారు.