గుడిసెలను కూల్చిన వారిపై కేసులు పెట్టాలి

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకే రవి
నవతెలంగాణ-చెన్నూర్‌
నివాస స్థలాలకు పట్టాలివ్వాలని ఐదు నెలలుగా గుడిసెలు వేసుకుని పోరాడుతున్న పేదలపై దాడి చేసి.. గుడిసెలను కూల్చి కాల్చేసిన దుండగులపై వెంటనే కేసులు నమోదు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకే రవి డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన భూపోరాట క్షేత్రం వద్దకు వెళ్లి బాధితులను పరామర్శించారు. అనం తరం మీడియాతో మాట్లాడుతూ.. దుండగులపై పోలీసులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పేదలపై కేసులు నమోదు చేయడంలో ఉన్న శ్రద్ధ.. కబ్జాదారులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి రెండ్రోజులు కావస్తున్నా ఏ ఒక్కరినీ అరెస్టు చేయకపోవడంలో పోలీసుల ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తక్ష ణమే నిందితులను అరెస్టు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ పర్యటనలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు బోడంకి చందు, పట్టణ కార్యదర్శి ఎండీ హవేశ్‌ తదితరులు ఉన్నారు.