– గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈనెల 29,30 తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. విద్యార్థులు చేస్తున్న డిమాండ్‌పై టీఎస్‌పీఎస్సీ సానుకూలంగా పరిశీలించాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. వరుసగా గురుకుల ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్ నియామక పరీక్షల నిర్వహణ మధ్యలో గ్రూప్-2 పరీక్షలు రావడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దీనిపై పరిశీలన చేస్తామంటూ స్వయంగా సీఎం కేసీఆర్ ఇటీవల శాసనసభ సమావేశాల్లోనే హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేస్తున్న తరుణంలో విద్యార్థులు అవకాశం కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వాయిదా వేయాలంటూ టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద గురువారం నిరసన తెలిపిన కారణంతో పోలీసులు అరెస్టు చేసిన విద్యార్థులు, అభ్యర్థులపై కేసులు నమోదు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కూనంనేని విజ్ఞప్తి చేశారు.
అరెస్టయిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసులు పెడితే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారతుందని ఆందోళన వ్యక్తం చేశారు.