కులాలు, మతాల పేరిట కుట్రలు..

– తెచ్చుకున్న తెలంగాణను రక్షించుకుందాం..
– కుట్రదారులకు బుద్ధి చెప్పండి
– విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి
– వృత్తిని కించపరిస్తే కేసులు తప్పవు :శ్రీనివాస్‌గౌడ్‌
– ఆర్థికంగా, ఆత్మగౌరవంతో బతికేలా చేయూత : గంగుల
– చైర్మెన్‌గా పల్లె రవికుమార్‌గౌడ్‌ బాధ్యతల స్వీకరణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
‘కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నాం. ఎంతో మంది అమరులయ్యారు. ఈ తెలంగాణపై కులాలు, మతాల పేరుతో కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టి తెలంగాణను రక్షించుకుందాం’ అని విద్యుత్‌ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో తెలంగాణ కల్లు గీత పారిశ్రామిక సహకార, ఆర్థిక సంక్షేమ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మెన్‌గా పల్లె రవికుమార్‌గౌడ్‌ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ కల్లుగీతపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని అన్నారు. గౌడలను ఉత్పత్తిలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ బీసీలు వెనుకబడ్డ వారు కాదనీ, గత పాలకుల నిర్లక్ష్యంతో వారు వెనుకకు నెట్టేయబడ్డారని అన్నారు. వారు ఆర్థికంగా, ఆత్మగౌరవంతో బతికేలా సర్కార్‌ చేయూతనిస్తున్నదని తెలిపారు. కల్లుగీత వత్తి దారుల సంక్షేమానికి, అభివద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు.ఉద్యమకారుడు, వెనుకబడిన వర్గాల ప్రతినిధి పల్లె రవికుమార్‌ గౌడ్‌కు సీఎం కేసీఆర్‌ గొప్ప అవకాశమిచ్చారని గుర్తుచేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ కొందరు గౌడ వృత్తిని కించపరచడంతోపాటు నీరాపై విషప్రచారం చేస్తున్నారని తెలిపారు. వాటిని గౌడలు చూస్తూఊరుకోబోరని, కేసులు పెడతామని హెచ్చరించారు. వైన్‌షాపులు అంటే సంపన్నులకు మాత్రమే అనే ముద్రను చెరిపేసి గౌడలకు 15శాతం రిజర్వేషన్‌ ప్రకారం దుకాణాలను కేటాయిస్తున్నామని చెప్పారు. కర్ణాటకలో గౌడ సీఎం ఉన్నా ఆ వృత్తి అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని గుర్తుచేశారు. కానీ రాష్ట్రంలో మాత్రం గౌడల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు.నీరా కోసం బెంజ్‌కారులో వస్తున్నారని, దానికి డిమాండ్‌ పెరిగిందని వివరించారు. పనిచేసేవారికి పదవులు వస్తాయని, ఉద్యమకారులకు సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యత ఇస్తారనడానికి రవికుమార్‌గౌడ్‌కు పదవినివ్వడమే నిదర్శనమని అన్నారు. రవికుమార్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను త్రికరణ శుద్ధితో నెరవేరుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్‌, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు గౌడ వత్తిదారులు, అభిమానులు పాల్గొన్నారు.