ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలి

– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నీళ్ళే సమస్త ప్రాణ కోటికి జీవనాధారమనీ, ప్రతీ బొట్టును ఒడిసి పట్టుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్టాన్‌, గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నీటి ప్రాముఖ్యతపై చేపట్టిన జన చైతన్య ప్రచార యాత్రను హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఆదివారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సు, రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కవిత్వ ఉత్సవంలో ఆయన మాట్లాడారు. నీటిని సంరక్షిస్తేనే భవిష్యత్తు ఉంటుందనిఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని కోరారు. నీటిని వృధా చేస్తే రేపటి తరాలకు మిగిలేది కన్నీరేననిహెచ్చరించారు.