– మనీశ్ సిసోడియా అరెస్టు
– మనీలాండరింగ్ ఆరోపణలపై అదుపులోకి తీసుకున్న ఈడీ
– బెయిల్ విచారణకు ముందురోజే ఘటన
న్యూఢిల్లీ : ఆమాద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను మరొక కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్‌పై నేడు (శుక్రవారం) విచారణ జరగనున్నది. దీనికి ముందు రోజే ఈడీ ఆయనను అరెస్టు చేయడం గమనార్హం. కొత్త లిక్కర్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై రెండు రోజుల పాటు మనీశ్ సిసోడియాను ఈడీ విచారించింది. అనంతరం ఆయనను అరెస్టు చేసింది. సీబీఐ కోర్టు నుంచి మనీశ్ సిసోడియా బెయిల్‌ను కోరుతున్న తరుణంలో ఇప్పుడు ఈడీ అరెస్టు చేయడంతో పరిస్థితులు ఆయనకు సంక్లిష్టంగా మారాయి. ఈడీ ఆయనను నేడు (శుక్రవారం) కోర్టులో ప్రవేశపెట్టనున్నది. ఇదే రోజు ఆయన బెయిల్ పిటిషన్ కూడా విచారణకు వచ్చే అవకాశం ఉన్నది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించిన ఆరోపణలపై సీబీఐ.. ఆయనను గతనెల 26న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి మనీశ్ సిసోడియా ఢిల్లీ తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈడీ అరెస్టు ఘటనపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందించారు. ఆయనను ఎలాగైనా లోపల ఉంచే లక్ష్యంతోనే ఈడీ ఈ చర్యకు దిగిందని ట్వీట్ చేశారు. ”మనీశ్‌ను తొలుత సీబీఐ అరెస్టు చేసింది. సోదాల్లో ఎలాంటి ఆధారాలూ, నగదూ లభించలేదు. రేపు (శుక్రవారం) బెయిల్ విచారణ ఉన్నది. శుక్రవారం మనీశ్ విడుదలయ్యేవాడు. అందుకే ఈడీ ఆయనను అరెస్టు చేసింది. ప్రతి రోజూ నకిలీ కేసులు సృష్టించిన ఆయనను ఎలాగైనా లోపల ఉంచడమే వారి ఏకైక లక్ష్యం. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు సమాధానం చెప్తారు” అని కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు.