న్యూఢిల్లీ : సీబీఐ అధికారులపై నమోదైన శాఖాపరమైన కేసుల విచారణ వివిధ దశలలో ఉన్నదని కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) తన తాజా నివేదికలో తెలిపింది. 2022 డిసెంబర్ నాటికి గ్రూప్-ఏ అధికారుల పైన 52 కేసులు, గ్రూప్-బీ, సీ అధికారుల పైన 19 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించింది. సీబీఐ అధికారుల పైన కేసులు పెండింగ్‌లో ఉండడంతో ఆ సంస్థ పేరు ప్రతిష్టలు దిగజారుతున్నాయని సీవీసీ వ్యాఖ్యానించింది. గ్రూప్-ఏ అధికారులపై పెండింగులో ఉన్న 52 కేసులలో 23 కేసులు నాలుగు సంవత్సరాలుగా అపరిష్కృతంగానే ఉన్నాయి. ఐదు కేసులు 3-4 సంవత్సరాలుగా, ఏడు కేసులు 2-3 సంవత్సరాలుగా, తొమ్మిది కేసులు 1-2 సంవత్సరాలుగా, ఎనిమిది కేసులు సంవత్సరం లోపు పెండింగులో ఉన్నాయి. రెండు కేసులు ఇప్పటికీ తుది ఆదేశాల కోసం సిబ్బంది, శిక్షణ శాఖ వద్ద ఉన్నాయి. మిగిలిన 50 కేసులలో విచారణ వేర్వేరు దశలలో ఉంది.
గ్రూప్-బీ, సీ అధికారులకు సంబంధించి 19 కేసులు శాఖాపరమైన చర్యల కోసం ఎదురు చూస్తున్నాయి. వీటిలో 12 కేసులు ఒక సంవత్సర కాలంగా పెండింగులో ఉండగా మూడు కేసులు నాలుగు సంవత్సరాల నాటివి. సీబీఐలో వివిధ ర్యాంకులలో 1,695 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీవీసీ తెలిపింది. సీబీఐ విచారణ జరుపుతున్న 6,841 అవినీతి కేసులలో 313 కేసుల విచారణ 20 సంవత్సరాలకు పైగానే సాగుతోంది. విచారణను సంవత్సర కాలంలో ముగించాల్సి ఉన్నప్పటికీ వందలాది కేసులలో అది సాధ్యపడడం లేదు.