న్యూ పెన్షన్‌ స్కీమ్‌ రద్దు చేయాలిొ మహారాష్ట్ర ఉద్యోగుల సమ్మెకు సీసీజీజీఓఓ సంఘీభావం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పాత పెన్షన్‌ పథకాన్ని (ఓపీఎస్‌) అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగులు,ఆఫీసర్లు, బోధనా, బోధనేతర సిబ్బంది, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ కౌన్సిల్‌ ఉద్యోగులు, యావత్‌ కార్మికులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ ఆర్గనైజేషన్స్‌ కాన్ఫెడరేషన్‌ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ) సంఘీభావం ప్రకటించింది. సమ్మె కారణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు స్తంభించి పోయాయని తెలిపారు. ఉద్యోగులకు సంఘీభావంగా ముంబై ఆజాద్‌ మైదాన్‌లో బుధవారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, పెన్షనర్లు , బీఎంసీ ఉద్యోగులు, ఇతర కార్మికులు ఆందోళన నిర్వహించారని తెలిపారు. పై డిమాండ్ల సాధన కోసం కాన్ఫెడరేషన్‌, ఆలిండియా స్టేట్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద వేలాది మంది ఉద్యోగులు పార్లమెంట్‌ మార్చ్‌ను చేపట్టారని వివరించారు. ఎన్‌.పి.యస్‌ కారణంగా ఉద్యోగుల భవిష్యత్తు అనిశ్చితంగా ఉన్నందున ఓ.పీ.ఎస్‌ను పునరుద్ధరించడం న్యాయబద్ధమైన కోర్కె అని ఈ సందర్భంగా కాన్ఫెడరేషన్‌ జాతీయ ఉపాధ్యక్షులు వి.కష్ణ మోహన్‌ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వాలు పాత పెన్షన్‌ పథకాన్ని (ఓపీఎస్‌) పునరుద్ధరించాయనీ, పశ్చిమబెంగాల్‌లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ హయాం నుంచీ ఓపీఎస్‌ కొనసాగుతున్నదని పేర్కొన్నారు. కేరళ, త్రిపుర వంటి రాష్ట్రాల్లో పాలన మారిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఓపీఎస్‌ నుండి ఎన్‌.పి.యస్‌ కి మారాయన్నారు. కేరళ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఓపీఎస్‌ పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి కమిటీలను నియమించాయన్నారు.