కులగణన చేపట్టాలి

Census should be taken– జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం
– విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు ప్రజలకు భారం
– ప్రజలపై ఆర్థిక భారాలను డ్డుకుంటాం
– దేశవ్యాప్తంగా పాలస్తీనా సంఘీభావ కార్యక్రమాలు
– తెలంగాణలో పోటీ చేసే స్థానాలపై చర్చ కొనసాగుతోంది : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
– రాజస్థాన్‌లో 17, మధ్యప్రదేశ్‌లో 4, ఛత్తీస్‌గఢ్‌లో 3 స్థానాల్లో పోటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
స్వతంత్ర దేశం కోసం పాలస్తీనా ప్రజలు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా కార్యక్రమాలు చేపట్టాలని, ఇజ్రాయెల్‌ ఆక్రమణ, మారణహౌమానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ అన్ని పార్టీలకు పిలుపునిచ్చింది. గాజాలో కాల్పుల విరమణ, పౌరులకు మాన వతా సహాయం అందించాలన్న ఐక్యరాజ్యసమితి తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉన్న మోడీ ప్రభుత్వ చర్యను కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. సోమవారం నాడిక్కడ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం (ఏకేజీ భవన్‌)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మూడు రోజుల పాటు జరిగిన కేంద్ర కమిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను సీతారాం ఏచూరి వివరించారు.మోడీ ప్రభుత్వ వైఖరి పాలస్తీనియన్లకు మద్దతు ఇచ్చే భారతదేశ చరిత్ర, సంప్రదాయానికి విరుద్ధంగా ఉంది. ఐక్యరాజ్యసమితి తీర్మానంలోని డిమాండ్లను వెంటనే అమలు చేయాలి. ఇజ్రాయెల్‌ అన్ని అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ మారణహౌమ యుద్ధం చేస్తోంది. తక్షణ కాల్పుల విరమణను డిమాండ్‌ చేస్తూ అంతర్జాతీయ నిరసనలో సీపీఎం భాగస్వా మ్యమైంది. 1967కి పూర్వపు సరిహద్దులతో పాటు తూర్పు జెరూసలేం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా దేశంగా యుఎన్‌ భద్రతా మండలి ఆదేశించిన ద్విజాతీయ పరిష్కారాన్ని వెంటనే అమలు చేయాలి” అని తెలిపారు.జాతీయ స్థాయిలో కుల గణన నిర్వహించాలి.
”నవంబర్‌ 26 నుంచి 28 వరకు జరగనున్న దేశవ్యాప్త కార్మిక, కర్షక మహాపడావ్‌కు సీపీఐ(ఎం) మద్దతు తెలుపుతుంది. దళిత సంఘాలు, వేదికల నేతృత్వంలో డిసెంబర్‌ 4న జరిగే చలో పార్లమెంట్‌కు మద్దతు ఇవ్వాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. సాధారణ జనాభా గణనతో పాటు అఖిల భారత కుల గణన కూడా నిర్వహించాలి. రాష్ట్ర స్థాయిలో కుల గణనలు నిర్వహించడం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వచ్చే అంశం. కానీ జనాభా లెక్కలకు అఖిల భారత ప్రాతిపదిక అత్యంత అవసరం. అని సీతారాం ఏచూరి అన్నారు.
విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లతో జనంపై మోయలేని భారం
ప్రజలపై మోయలేని భారం పడే విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్ల అమలును నిలిపివేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ డిమాండ్‌ చేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. ప్రీపెయిడ్‌ విద్యుత్‌ వినియోగదారులపై స్మార్ట్‌ మీటర్లను విధించాలన్న మోడీ ప్రభుత్వ నిర్ణయం విద్యుత్‌ రంగాన్ని ప్రయివేటీకరించడమేనని విమర్శించారు. ఇప్పటికే విద్యుత్‌ టారిఫ్‌ ఎక్కువగా ఉంది. స్మార్ట్‌ మీటర్లు విద్యుత్‌ ఉత్పత్తిని పూర్తిగా ప్రయివేట్‌ కార్పొరేట్‌లకు అందించి లాభాలను పొందేందుకు ఒక వేదికను రూపొందించడానికి ఉద్దేశించబడ్డాయి. దీనివల్ల పేదలు, రైతులే కాకుండా సామాన్యులు కూడా నష్టపోతారు” అని అన్నారు.
ఒకే దేశం-ఒకే ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం
”జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన కమిటీ ఉంది. ఈ ప్రతిపాదన అమలు ఇప్పుడు అభిప్రాయాన్ని కోరింది. 2024 జనవరి 18లోగా రాతపూర్వకంగా రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలపాలని కోరింది. కొన్ని నెలల తర్వాత సాధారణ ఎన్నికల ప్రతిపాదనతో కేంద్రం వైఖరి స్పష్టమైందనీ, ఈ ప్రతిపాదన రాజ్యాంగంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ఫెడరలిజంపై ద్విముఖ దాడి. రాజ్యాంగంలో ముఖ్యమైన సవరణలు కాకుండా, అటువంటి ప్రతిపాదన లోక్‌సభ ఎన్నికలతో సమకాలీకరించడానికి రాష్ట్రాల అసెంబ్లీల జీవితాన్ని తగ్గించడం లేదా పొడిగించడం వంటివి చేస్తుంది. ప్రభుత్వం మెజారిటీని కోల్పోయినప్పుడు, దానిని కొనసాగించడం చట్టవిరుద్ధం. ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కును కాలరాస్తూ కేంద్ర పాలన విధిస్తే అది ప్రజాస్వామ్య విరుద్ధం” అని పేర్కొన్నారు
రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 17 స్థానాల్లో పోటీ
”ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల పరిస్థితిపై కేంద్ర కమిటీ చర్చించింది. రాజస్థాన్‌లో రాష్ట్ర కమిటీ ప్రతిపాదించిన 17 మంది అభ్యర్థుల జాబితాను కమిటీ ఆమోదించింది.ఈ కమిటీలో ఇద్దరు సీపీఐ(ఎం) సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ మూడు స్థానాల్లో పోటీ చేస్తుంది. మధ్యప్రదేశ్‌లో పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుంది. తెలంగాణలో పోటీపై చర్చ కొనసాగుతోంది” అని తెలిపారు.
మణిపూర్‌ లో మరింత దిగజారిన పరిస్థితి
”మణిపూర్‌లో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇది మోడీ ప్రభుత్వం పూర్తి వైఫల్యాన్ని స్పష్టం చేస్తుంది. పరిస్థితిని నియంత్రించడంలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది. రాష్ట్రంలో జాతి పోలరైజేషన్‌ కు మత రంగు పులుముతోంది. ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌ను తక్షణమే తొలగించి మణిపూర్‌లో అల్లకల్లోలాన్ని అరికట్టాలి” అని డిమాండ్‌ చేశారు.
ప్రజలపై ఆర్థిక భారాలు
”ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారాలపై మోడీ ప్రచార యంత్రాంగం సృష్టించిన తప్పుడు వాదనలను తిప్పికొట్టాలి. నియంత్రించలేని ధరల పెరుగుదల, నిరుద్యోగం వల్ల గృహ ఆర్థిక ఆస్తులతో ప్రజల ఆదాయంలో 2020-21 నుంచి 2022-23 మధ్య జీడీపీలో 11.5 శాతం నుండి 5.1 శాతానికి క్షీణించాయి. ఇది గృహ రుణభారంలో తీవ్ర పెరుగుదలకు దారితీస్తుంది. ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గ్రామీణ బాధలు, ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశం స్థానం 125 దేశాలలో 111 వద్ద చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోయింది” అని వివరించారు.