హిందూత్వపై అధ్యయన కేంద్రం

– దేశ విభజనపై కూడా…
– ఢిల్లీ యూనివర్సిటీ ఆమోదం
న్యూఢిల్లీ : హిందూత్వపై అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఢిల్లీ విశ్వవిద్యాలయం అనుమతి ఇచ్చింది. దేశ విభజనపై కూడా మరో అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ రెండు కేంద్రాల ఏర్పాటుకు యూనివర్సిటీ అకడమిక్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. అంతేకాదు… అండర్‌ గ్రాడ్యుయేట్‌ రాజనీతి శాస్త్రం కోర్సులో కరడుకట్టిన హిందూత్వ వాది సావర్కర్‌పై ఒక పేపర్‌ను ప్రవేశపెట్టేందుకు కూడా గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. యూనివర్సిటీ నిర్ణయాలను సీనియర్‌ విద్యావేత్తలు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ సిద్ధాంతాలకు అనుగుణంగా యూనివర్సిటీ కాషాయ రంగు పులుముకుంటోందని వారు మండిపడ్డారు. బీజేపీ విచ్ఛిన్నకర అజెండాను మరింత ముందుకు తీసికెళ్లేందుకు ఈ నూతన అధ్యయన కేంద్రాలు దోహదపడతాయని వారు విమర్శించారు. గతంలో మహాత్మాగాంధీ జీవితం, ఆలోచనలపై విద్యార్థులకు పాఠ్యాంశం ఉండేది. యూనివర్సిటీ తీసుకున్న తాజా నిర్ణయంతో విద్యార్థులు మహాత్మాగాంధీకి బదులు సావర్కర్‌ను గురించి తెలుసుకొని బీఏ డిగ్రీ కోర్సు పూర్తి చేస్తారు.