కేరళ ఇండ్ల స్కీంపై కేంద్రం లొల్లి..

కేరళ ఇండ్ల స్కీంపై కేంద్రం లొల్లి..– గ్రాంట్‌ల నిలుపుదల
– కేరళ సర్కారు తీవ్ర అసంతృప్తి
తిరువనంతపురం : ఇండ్ల పథకం, ప్రభుత్వ గ్రాంట్‌ల విషయంలో కేంద్రం తీరుపై కేరళ సర్కారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హౌసింగ్‌ స్కీమ్‌లో క్రెడిట్‌ కోసం  పాకులాడుతున్నదనీ, స్థానిక స్వపరిపాలన గ్రాంట్‌ల విడుదలను నిలిపివేసిందని ఆరోపించింది. కేరళలోని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో నిరాశ్రయులైన ప్రజలకు గృహనిర్మాణం కల్పించేందుకు జీవనోపాధి చేరిక ఆర్థిక సాధికారత మిషన్‌ (లైఫ్‌)ను ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం 2016 నుంచి 3,56,108 ఇండ్లను లబ్ధిదారులకు అందజేయగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 1,41,257 ఇండ్లను పూర్తి చేయాల్సి ఉన్నది.
భూమి లేదా ఇల్లు లేని సుమారు 4.32 లక్షల మందికి గృహ సౌకర్యా లను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం లైఫ్‌ మిషన్‌ 2016, నవంబర్‌ 10న ప్రారం భించింది.
ఆ తర్వాత ప్రభుత్వం ఈ సంఖ్యను 4.72 లక్షలకు సవరిం చింది. కేరళ ప్రభుత్వం లైఫ్‌ మిషన్‌ కింద ఒక్కో ఇంటికి రూ.4 లక్షలు అందిస్తున్నది. పథకం కింద ఆమోదించబడిన ఇండ్లలో కొద్ది శాతం కేంద్ర నిధులు ఉంటాయి.
కేంద్ర, రాష్ట్ర వాటా ఇలా..
రాష్ట్ర మంత్రి ఎం.బి రాజేష్‌ ప్రకటన ప్రకారం.. కేంద్రం కేవలం 32,171 ఇండ్లకు రూ.72,000 చొప్పున మంజూరు చేయగా, 79,860 ఇండ్లకు రూ.1,50,000 చొప్పున మంజూరు చేసింది. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం పీఎంఏవై పథకం కింద ఉన్న 32,171 ఇండ్లకు రూ.3,28,000 చొప్పున అందించ గా, లైఫ్‌ మిషన్‌ కింద మిగిలిన 2,44,077 ఇండ్లకు రూ.4 లక్షల చొప్పున అందించింది. ”లబ్దిదారుల కోరిక మేరకు ఇండ్లను డిజైన్‌ చేసుకునే హక్కును ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వ విరాళాలను బహిర్గతం చేసే లోగో లేదా గుర్తు లేకుండా వారు ఇతర వ్యక్తులలాగానే ఆత్మగౌరవంతో ఇంట్లో నివసించాలి” అని మంత్రి ప్రకటనలో పేర్కొన్నారు.
హౌసింగ్‌ స్కీమ్‌లో కేంద్రం జోక్యాన్ని వ్యతిరేకించాలని కేరళ ప్రజలకు విజ్ఞప్తి చేసిన మంత్రి.. స్వచ్ఛ్‌ భారత్‌తో సహా ప్రాజెక్టులకు కేంద్రం ఇలాంటి కో-బ్రాండింగ్‌ కార్యకలాపాలను విధిస్తున్నదని ఆరో పించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ వాటా ఇస్తున్నదని గుర్తు చేశారు.
‘ఫండ్‌ విడుదలకు ఆమోదయోగ్యం కాని షరతులు’
15వ ఆర్థిక సంఘం ప్రకారం గ్రాంట్‌ల పంపిణీలో జాప్యం, ఖర్చు చేయడానికి షరతులు విధించడం ఎల్‌ఎస్‌జీడీ ఎదుర్కొంటున్న మరో సమస్య. ”కేంద్రం, ఆర్థిక సంఘం 2020-21 నుంచి ఖర్చుపై షరతులు విధించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లను స్థానిక సంస్థలు ఎలా ఖర్చు పెట్టాలో కూడా వారే నిర్దేశిస్తున్నారు” అని మంత్రి విమర్శించారు. ఆరు వేర్వేరు పథకాల కోసం గ్రాంట్‌ను వినియోగించు కోవడానికి దేశవ్యాప్తంగా నిబంధన విధించడం మాకు ఆమోదయోగ్యం కాదని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్‌ఎస్‌జీకి రూ. 814 కోట్ల గ్రాంట్‌లను కేంద్రం నిలిపి వేసిందని కేరళ సర్కారు విమర్శించింది. గ్రాంట్లు విడుదల చేయాలని నిరంతరం డిమాండ్‌ చేసిన తర్వాత, నవంబర్‌ 21 నాటికి రాష్ట్రానికి రూ. 252 కోట్లు వచ్చా యనీ, అయితే మూడింట రెండు వంతులకు పైగా గ్రాంట్లు విడుదల కాలేదని వివరించింది.