జాతీయ విపత్తు కింద కేంద్రం రూ.5వేల కోట్లు కేటాయించాలి

 Center should allocate Rs.5000 crores under national calamity– యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి : సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ-హన్మకొండ
రాష్ట్రంలో భారీవర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద రూ.5 వేల కోట్లు కేటాయించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం హన్మకొండ పట్టణంలో వరద ముంపునకు గురైన నయీంనగర్‌ పెద్ద మోరీ, జవహర్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో స్థానిక నాయకులతో కలిసి చాడ సందర్శించారు. అనంతరం బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులకు తీరని నష్టం జరిగిందని, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి వెళ్లడంతో సరిపోదని, కేంద్రం నుంచి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం రూ. 500కోట్లు కేటాయించడం కంటితుడుపు చర్యగానే ఉందని, వరద ముంపు ప్రాంతాల్లో శాశ్వత నివారణా చర్యలు చేపట్టాలన్నారు. వరంగల్‌, హన్మకొండ పట్టణాల్లో నాలాలు, చెరువులు కబ్జాకు గురయ్యాయని, వాటిపై పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం వల్లనే కాలనీలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. పాలకుల అలసత్వం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా ఆక్రమణకు గురైన నాలాలపై సర్వే చేసి, నిర్మాణాలను తొలగించి వారికి ప్రత్యామ్నాయం చూపాలని కోరారు. నాలాలు వెడల్పు చేయాలని, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని సూచించారు. ఇటీవల వరదల వల్ల కొట్టుకొని పోయిన, కూలిపోయిన ఇండ్లకు నష్టపరిహారం ఇవ్వాలని, వరదల వల్ల మృతిచెందిన వారికి ఎక్స్‌గ్రేషియా అం దించాలని డిమాండ్‌ చేశారు. గ్రేటర్‌ వరంగల్‌ కు ఏటా రూ.300 కోట్లు ఇస్తామని చెప్పిన సీఎం మాట నీటిమూటగా మారిందని, స్మార్ట్‌ సిటీ కింద ప్రకటించిన కేంద్రం ఏమిచ్చిందో బీజేపీ నాయకులు చెప్పాలని ప్రశ్నించారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకి రూ.20వేల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే పశువులు చనిపోయి నష్ట పోయారని, యుద్ద ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని అన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్‌, నాయకులు ఆదరి శ్రీనివాస్‌, మారు పాక అనిల్‌కుమార్‌, కొట్టెపాక రవి, బాషబోయిన సం తోష్‌, మాలోతుశంకర్‌, మునిగాల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.