రైలు ప్రమాద బాధితులను కేంద్రం ఆదుకోవాలి

– బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షులు తోట చంద్రశేఖర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాద దుర్ఘటన అత్యంత బాధాకరమని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు డాక్టర్‌ తోట చంద్రశేఖర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మూడు రైళ్లు ఢకొీన్న ఘటనలో 278 మంది ప్రయాణీకులు మతి చెందటం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో ఇప్పటివరకు గాయపడిన 1100మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రైలు ప్రమాద ఘటనలో చేపడుతున్న సహాయక చర్యలను ముమ్మరం చేసి ప్రాణ నష్టాన్ని నివారించేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. ప్రమాదంలో మతి చెందిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఆర్ధిక సహాయాన్ని రూ.25 లక్షలకు పెంచి వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమివ్వాలని డిమాండ్‌ చేశారు. రైలు ప్రమాద ఘటనపై కేంద్రం సమగ్ర విచారణ చేపట్టి ఇది మానవ తప్పిదమా? తీవ్రవాద చర్యా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలచి సహాయక చర్యల్లో పాల్గొనాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. బాలాసోర్‌ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు స్వచ్చందంగా రక్తదానం చేసేందుకు ముందుకొచ్చిన యువత మానవత్వాన్ని చాటి పలువురికి స్పూర్తిదాయకంగా నిలిచిందని పేర్కొన్నారు.
శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కేటీఆర్‌
మంత్రి కేటీఆర్‌ తన ప్రయివేట్‌ సెక్రటరీ(పీఎస్‌) కానుగుల శ్రీనివాస్‌ కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. శ్రీనివాస్‌ తల్లి కానుగుల రాములమ్మ గత నెల 18న మరణించారు. ఆ సమయంలో మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో శ్రీనివాస్‌ కుటుంబాన్ని శనివారం ఆయన పరామర్శించారు.