కేంద్రం అప్పు రూ.155.6 లక్షల కోట్లు

–  పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌
2014 మార్చి 31 అంటే నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం కోల్పోయిన నాటికి కేంద్ర ప్రభుత్వం అప్పు రూ.58.6 లక్షల కోట్లు కాగా, 2023 మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రూ. 155.6 లక్షల కోట్లు (జీడీపీలో 57.1 శాతం)కు పెరిగింది. సోమవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖితపూర్వక సమాధానం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ అప్పు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. అప్పుకు చెల్లిస్తున్న వడ్డీ కూడా ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది.
సైన్యంలో 3,367 వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీ
త్రివిద దళాల్లో 3,367 వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజరు భట్‌ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇండియన్‌ ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నావీలో 630 డాక్టర్‌, 73 డెంటల్‌, 701 నర్స్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర మెడికల్‌ స్టాఫ్‌1,960 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
సెంట్రల్‌ యూనివర్శిటీల్లో 5,825 టీచింగ్‌ పోస్టులు ఖాళీ
15,390 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీ
దేశంలోని 45 సెంట్రల్‌ యూనివర్శిటీల్లో 5,825 టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
దేశంలో 45 సెంట్రల్‌ యూనివర్శిటీల్లో ఎస్‌టి 516, ఎస్‌సి 861, ఒబిసి 2,185, జనరల్‌ కేటగిరీ 1,662 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అలాగే 2023 ఏప్రిల్‌ 1 నాటికి సెంట్రల్‌ యూనివర్శిటీల్లో 15,390 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మరో ప్రశ్నకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్‌ సర్కార్‌ తెలిపారు.
96,261 కంపెనీలు స్వచ్ఛందంగా నిష్క్రమణ
దేశంలో గడిచిన ఐదేండ్లలో 96,261 కంపెనీలు స్వచ్ఛందంగా నిష్క్రమించాయని కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2018 ఏప్రిల్‌ 1 నుండి, 2023 మార్చి 31 వరకు 96,261 కంపెనీలు స్వచ్ఛందంగా నిష్క్రమించాయని తెలిపారు.
గత ఐదేండ్లలో కేంద్ర ప్రభుత్వం అప్పు
సంవత్సరం అప్పు (లక్షల కోట్లు) చెల్లిస్తున్న వడ్డీ (లక్షల కోట్లు)
2018-19 రూ.93.3 రూ.5.83
2019-20 రూ.105.1 రూ.6.12
2020-21 రూ.121.9 రూ.6.80
2021-22 రూ.138.7 రూ.8.05
2022-23 రూ.155.6 రూ.9.28
కార్పొరేట్లకు రద్దు చేసిన రుణాలు; రూ.10.57 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: పేద, మధ్యతరగతి వారు వేలల్లో అప్పు తీసుకుని చెల్లించకుంటేనే నానా ఆందోళన చేసే బ్యాంకులు.. బడా బాబులకు చెందిన లక్షల కోట్ల రుణాలను మాత్రం చూసి చూడనట్లుగా రద్దు చేస్తున్నాయి. గడిచిన ఐదేండ్లలో ఏకంగా రూ.10.57 లక్షల కోట్ల అప్పులను రద్దు చేశాయని ఆర్బీఐ గణంకాలు చెబుతన్నాయి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఇచ్చిన నివేదిక ప్రకారం ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఓ కథనం ప్రచురించింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో 2022-23లో రూ.2.09 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశాయి. మొండి బాకీల కింద చేర్చిన ఈ మొత్తాల పద్దులను తొలగించాయి. దీంతో స్థూల నిరర్థక ఆస్తులను 2023 మార్చి ముగింపు నాటికి 3.9 శాతానికి తగ్గినట్లు ఆర్బీఐ, ప్రభుత్వాలు చూ పిస్తున్నాయి. 2018 మార్చి ముగింపు నాటికి స్థూల నిరర్థక ఆస్తులు రూ. 10.21 లక్షల కోట్లుగా ఉండగా.. 2023 మార్చి ముగింపు నాటికి రూ. 5.55 లక్షల కోట్లకు తగ్గాయి. ఇందుకు ప్రధాన కారణం ఆ పద్దులను రానీ బాకీల కింద తొలగించడమే. ఆర్బీఐ డేటా ప్రకారం.. 2022-13 నుంచి రూ.15,31,453 కోట్ల మొండి బాకీలను రద్దు చేశారు. గడిచిన మూ డేండ్లలో రూ.5,86,891 కోట్ల మొండి బాకీల్లోంచి కేవలం రూ.1,09,186 కోట్లు మాత్రమే వసూళ్లు అయ్యాయి. కేవలం 18.60 శాతం మాత్రమే రికవరీ చేయగలిగాయి. 2022-23లో రూ.2,09,144 కోట్లు, ఇంతక్రితం 2021-22లో రూ.1,74,966 కోట్లు, 2021 మార్చితో ముగిసిన ఏడాదిలో రూ.2,02,781 కోట్ల చొప్పున మొండి బాకీలను రద్దు చేశారు.