– ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం…
– 3 నుంచి నామినేషన్లు షురూ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రత్యేక బృందం వస్తున్నది. ఈనెల 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆరోజు నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. సీఈసీకి చెందిన సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు నితీశ్ వ్యాస్, ధర్మేంద్ర శర్మతో కూడిన బృందం రెండురోజులు హైదరాబాద్‌లో మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధికారులతోనూ భేటీ అవుతారు. ఎన్నికల నిబంధనావళి వెలువడిన తర్వాత జరిపిన తనిఖీల్లో పట్టుబడిన నగదు, ఇతర స్వాధీనాలపై తగు ఆదేశాలు జారీ చేస్తారు. అలాగే పొరుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవుతారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సరిహద్దుల్లో చెక్ పోస్టులు, తనిఖీలు వంటి అంశాలపై చర్చిస్తారు.
3 నుంచి నామినేషన్లు…
అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 3వ తేదీ జారీ కానుంది. అదేరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. దీనికోసం ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ల కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి వివాదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 5వ తేదీ ఆదివారం నామినేషన్లు స్వీకరించరు. ఆరోజు ఆ కార్యక్రమానికి సెలవు ప్రకటించారు. తిరిగి సోమవారం నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 13వ తేదీ నామినేషన్ల పరిశీలన, 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదేరోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాత నవంబర్ 30న పోలింగ్ జరుగుతుంది. అయితే ఈసారి సీఈసీ నామినేషన్ల దాఖలులో కొన్ని సవరణలు చేసింది. ఒక అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయోచ్చు. అఫిడవిట్ అసంపూర్తిగా ఉంటే రిటర్నింగ్ అధికారి సదరు అభ్యర్థికి నోటీసులు జారీ చేసి సవరించుకోవాలని సూచిస్తారు. అభ్యర్థి స్పందించకుంటే నామినేషన్ తిరస్కరిస్తారు.