చాంపియన్‌ స్పెయిన్‌

Champion Spain– ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 1-0తో గెలుపు
– మహిళల ఫిఫా ప్రపంచకప్‌
సిడ్నీ (ఆస్ట్రేలియా) : స్పెయిన్‌ నాయకి ఓల్గా కార్మోనా అదరగొట్టింది. ఆదివారం సిడ్నీలో జరిగిన మహిళల ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో కండ్లుచెదిరే గోల్‌తో మెరిసిన ఓల్గా.. ఫిఫా ప్రపంచకప్‌ చరిత్రలో స్పెయిన్‌కు తొలి టైటిల్‌ అందించింది. 2017లో జర్మనీ తర్వాత ఫిఫా ప్రపంచకప్‌ ముద్దాడిన తొలి యూరోపియన్‌ జట్టుగా సైతం స్పెయిన్‌ చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్‌, స్పెయిన్‌ మధ్య హోరాహోరీగా సాగిన టైటిల్‌ పోరులో 29వ నిమిషంలో ఓల్గా గోల్‌ కొట్టింది. ఎడమ కాలు కిక్‌తో బంతిని ఇంగ్లాండ్‌ గోల్‌ పోస్ట్‌ కార్నర్‌లోకి పంపించిన ఓల్గా.. స్పెయిన్‌లో సంబురాలకు తెరలేపింది. 68వ నిమిషంలో మరో గోల్‌ సాధించే అవకాశం సైతం స్పెయిన్‌కు లభించినా ఇంగ్లాండ్‌ గోల్‌కీపర్‌ అడ్డుకుంది. జెన్నీ హెర్మోస్‌ పెనాల్టీ కిక్‌ను లెఫ్ట్‌ సైడ్‌ డైవ్‌తో ఇంగ్లాండ్‌ గోల్‌కీపర్‌ నిలువరించింది. మానసిక ఆరోగ్యం, మరింత మెరుగైన ప్రొఫెషనల్‌ ఎన్విరాన్‌మెంట్‌ అంశాలపై గత ఏడాది స్పెయిన్‌ మహిళా అథ్లెట్లు జాతీయ జట్టు నుంచి తప్పుకుని సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జాతీయ జట్టులో సుమారుగా ఓ ముసలం పుట్టిన ఏడాది లోపే స్పెయిన్‌ చారిత్రక ఫిఫా ప్రపంచకప్‌ విజయాన్ని సాధించటం గమనార్హం. మ్యాచ్‌లో 58 శాతం బంతిని స్పెయిన్‌ నియంత్రణలో ఉంచుకుంది. 13 సార్లు స్పెయిన్‌ గోల్‌ ప్రయత్నాలు చేయగా.. ఐదుసార్లు నేరుగా గోల్‌పోస్ట్‌పైకి దూసుకెళ్లాయి. ఇంగ్లాండ్‌ ఎనిమిది సార్లు గోల్‌ కోసం ప్రయత్నించగా.. మూడు సార్లు టార్గెట్‌కు చేరువగా వెళ్లారు. అమెరికా (4), జర్మనీ (2), నార్వే (1), జపాన్‌ (1) తర్వాత ఫిఫా ప్రపంచకప్‌ను సాధించిన ఐదో జట్టుగా స్పెయిన్‌ నిలిచింది.