నగర కొత్వాల్‌గా ముగ్గురిలో ఒకరికి అవకాశం

Chance of one of the three as city kotwalనవతెలంగాణ స్పెషల్‌ కరస్పాండెంట్‌
అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని కేంద్ర ఎన్నికల కమిషన్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీ.వీ.ఆనంద్‌తో పాటు పలు జిల్లాల ఎస్పీలను బదిలీ చేయడంతో వారి స్థానంలో ఎవరిని నియమిస్తారని ఊహాగానాలకు తెరలేచింది. ముఖ్యంగా రాష్ట్రంలో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ పోస్టు తర్వాత పోలీస్‌ శాఖలో అత్యంత కీలకమైన పోస్టు నగర పోలీస్‌ కమిషనర్‌ది. ముఖ్యంగా ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కమిషనర్‌ను బదిలీ చేయాలని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన నేపథ్యంలో ఆయన స్థానంలో ఏ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారికి ఈ పోస్టు దక్కుతుందోనన్న చర్చ ఐపీఎస్‌ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించే నిజాయితీపరుడైన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిని కమిషనర్‌గా నియమించాలని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ నుంచి అంతర్గతంగా సూచనలు కూడా రాష్ట్ర సర్కారుకు అందినట్టు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం నగర పోలీస్‌ కమిషనర్‌గా నియమించదగ్గ ఐపీఎస్‌ అధికారుల్లో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో రాష్ట్ర పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య, రాష్ట్ర రైల్వే పోలీస్‌ విభాగం అదనపు డీజీ శివధర్‌ రెడ్డి, రాష్ట్ర హౌంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వీరు కాని పక్షంలో రాష్ట్ర సీఐడీ అదనపు డీజీ మహేష్‌ భగవత్‌, రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సంజరు కుమార్‌ జైన్‌ ల పేర్లు కూడా కమిషనర్‌ పోస్టుకు వినిపిస్తున్నట్టు తెలిసింది.