ఈతరం కోసం ‘అలనాటి చందమామ కథలు’

పిల్లలు కథలంటే ఎగిరి గంతులు వేస్తారు. ఎవరైనా కథలు చెబితే ఆసక్తిగా వింటారు. అలాంటి ప్రత్యేకతను కలిగి ఉంది కథ. ఏ రకం కథలైనా వినడానికి శ్రద్ధ చూపెడతారు. కేవలం పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా కథలు అంటే ఇష్టపడతారు. ఒకప్పుడు చందమామ కథలు చాలా ప్రాచుర్యం పొందాయి. నెలల తరబడి చందమామ పత్రిక కోసం ఎదురు చూసేవారు. చందమామ కథలు 14 భారతీయ భాషల్లో వెలుగులను పంచింది. ఆనాటి చందమామ కథలు అందమైన బొమ్మలతో అలరించాయి. అప్పటి కథలకు మళ్ళీ ప్రాణం పోస్తే ఇప్పటి పిల్లల కోసం గొప్పగా అలంకరించి మళ్లీ చందమామ కథలను అందిస్తున్నాడు రచయిత మాచిరాజు కామేశ్వరరావు. నేటి కాలానికి అనుగుణంగా అందమైన ముద్రణలతో రంగురంగుల బొమ్మలతో అబాల గోపాలాన్ని అలరించడానికి మళ్లీ పాఠకుల ముందుకు వచ్చింది చందమామ కథలు.
ఎవరి కోపం వారి పాలిట శాపం. కోపంతో జీవితాన్ని దుఃఖమయం చేసుకోకూడదు. జీవితం చాలా చిన్నది. ‘తన కోపమే తన శత్రువు’ అని తెలిపే సందేశాత్మకత కథ ‘కోపిష్టి మొగుడు’. ఈ కథ నేటి కాలపు మనషులకు చక్కగా అన్వయిస్తూ రాసినది.
మరొక కథ ‘అపార్థం’. ఇందులో మనం విన్నవి, కన్నవి కొన్ని సందర్భాలలో అపార్థం చేసుకుని మనకు మనమే అల్ల కల్లోలం సష్టించుకుంటాం. అందుకే నిజాలు తెలుసుకొని మాట్లాడాలనే నీతిని ఈ కథలో తెలుసుకుంటారు.
‘కట్నాల పిచ్చి’ కథలో పెళ్లి చేసుకోవడానికి డబ్బులు, కట్నాలు ముఖ్యం కాదు. చదువుకున్న వాళ్ళు కూడా వరకట్నం కోసం ఆశపడుతున్నారు. పెళ్లి చేసుకోవడానికి అందం గుణగణాలు ముఖ్యం అంటూ చక్కటి సందేశాన్ని ఈ కథ అందిస్తుంది.
‘ఇద్దరు నిరుద్యోగులు’ స్వ శక్తి మీద నమ్మకం ఉంటే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. సంపాదించుకున్న ఉద్యోగం నిలబెట్టుకోగల ఆత్మవిశ్వాసం ఎంతైనా అవసరమనే విషయం తెలుసుకుంటాం. ఇలా 45 కథల గురించి చెప్పుకుంటూ పోతే దేనికి ప్రత్యేకత దానికే ఉంది
నిజ జీవితానికి అనువదిస్తూ చందమామ కథలు ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్నాయి. అందరినీ అలరించే కథలు ఇవి. ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం. ప్రతి విద్యార్థి చేతిలో ఉండాల్సిన నీతి కథలు ఇవి.
ఇలాంటి మరెన్నో కథలు మాచిరాజు కామేశ్వరరావు అందించాలని కోరుకుంటూ వారికి హదయపూర్వక అభినందనలు తెలియజేద్దాం.

– యాడవరం చంద్రకాంత్‌ గౌడ్‌, 9441762105