న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం తుది దశకు చేరుకున్నది. చంద్రుడిపైకి రష్యా పంపిన లునా-25 విఫలం కావటంతో ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి భారత చంద్రయాన్-3 పైనే పడింది. ఇలాంటి తరుణంలో స్పేస్‌క్రాఫ్ట్‌లోని విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ చివరి చంద్ర కక్ష్య కదలికను పూర్తి చేసి, ఆగస్టు 23న చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించే కక్ష్యకు చేరుకున్నదని ఇస్రో వెల్లడించింది. ల్యాండర్ చంద్రుడికి అత్యంత దగ్గరగా ఉన్న కక్ష్యలో 25 కి.మీ మరియు సుదూర 134 కి.మీ. దూరంలో పరిభ్రమిస్తున్నదని వివరించింది. చంద్రయాన్-3 జులై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. గురువారం, ల్యాండర్ మాడ్యూల్ భూమి నుంచి దానిని మోసుకెళ్ళిన ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయింది. ప్రొపల్షన్ మాడ్యూల్ ఇప్పుడు నెలలు లేదా సంవత్సరాల పాటు భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని ఉపరితలంపై తక్కువ దూరం ప్రయాణించగలదు. అలాగే, దాని పర్యావరణాన్ని అధ్యయనం చేయగల ప్రగ్యాన్ అనే రోవర్ మాడ్యూల్‌ను కలిగి ఉంది.