పాఠశాలల పనివేళల్లో మార్పు

9.30 నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత స్కూళ్ల ప్రారంభం
– హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో మార్పులేదు : విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పనివేళలను ప్రభుత్వం మార్చింది. ఆయా పాఠశాలలు ఉదయం తొమ్మిది గంటల నుంచి కాకుండా 9.30 గంటలకు ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఎ శ్రీదేవసేన సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు. అయితే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పనివేళల్లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 8.45 నుంచి సాయంత్రం 3.45 గంటలకు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 8.45 నుంచి సాయంత్రం నాలుగు గంటలకు ఉంటాయని వివరించారు. ఉన్నత పాఠశాలల పనివేళల్లో మార్పులేదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అవి ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటలకు ఉంటాయనీ, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో ఉదయం 8.45 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తరగతులుంటాయని వివరించారు. ఆర్జేడీలు, డీఈవోలు, ఎంఈవోలు, హెడ్మాస్టర్లు రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లో ఈ పనివేళలు అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. పనివేళల మార్పు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
ప్రయివేటు పాఠశాలలు పాటిస్తాయా?
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పని వేళల మార్పును రాష్ట్రంలోని ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలలు పాటిస్తాయా?అన్నది చర్చనీయాంశం గా మారింది. ఉదయం 8.30 నుంచే కొన్ని ప్రయివేటు స్కూళ్లు ప్రారంభమవుతాయి. అంటే ఉదయం 7.30 నుంచి ప్రయివేటు బడులకు వెళ్లేందుకు బస్సులు, ఆటోల్లో బయలుదేరి వెళ్తున్నారు. అలాంటిది ఉదయం 9.30 నుంచి అంటే ఈ ఆదేశాలు అమలవుతాయా?అనే ప్రశ్న ఉత్పన్నమవు తున్నది. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కావాలి. ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలలు మాత్రం ఉదయం తొమ్మిది నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ విషయం విద్యాశాఖ అధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలకు పూనుకోవడం లేదు. అదే తరహాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పనివేళలనూ అవి పాటించే అవకాశం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
ఆ ఉత్తర్వులు ఉపసంహరించాలి : టీఎస్‌యూటీఎఫ్‌
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పనివేళలను ఉదయం 9.00కు బదులుగా 9.30 గంటలకు ప్రారంభించటం అశాస్త్రీయమని తెలం గాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌ యూటీఎఫ్‌) అభిప్రాయపడింది. పని వేళలను మారుస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్‌ చేశారు. పనివేళలు మార్చాలంటే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి విద్యార్థులు, తల్లిదండ్రులు తదితర భాగస్వాముల (స్టేక్‌ హోల్డర్స్‌) అభిప్రాయాలను సేకరించి నిర్ణయించాలని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) అమల్లోకి వచ్చిన సందర్భంలో ఆ విధంగా చర్చించి ప్రస్తుత పనివేళలను నిర్ణయించారని గుర్తు చేశారు. ఇందుకు భిన్నంగా ప్రభుత్వం ఏమాత్రం చర్చ లేకుండానే మార్పు చేయటం విచారకరమని విమర్శించారు. ఈ మార్పు కొద్దిమంది ఉపాధ్యాయులకు ఉపయోగపడొచ్చునేమో కానీ విద్యార్థులు, తల్లిదండ్రులకు ఏమాత్రం ఉపయోగం లేదని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇది పాఠశాలల పనివేళలల మార్పుపై విద్యాశాఖ ఏకపక్షంగా ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.
మార్పు సరికాదు : టీఆర్టీఎఫ్‌
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పనివేళలను మార్పు చేయడం సరైంది కాదని టీఆర్టీఎఫ్‌ అధ్యక్షులు కావలి అశోక్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి కటకం రమేష్‌ విమర్శించారు. శాస్త్రీయ బద్ధంగా పిల్లల మానసిక స్థితిగతులకు అను గుణంగా రూపొందించిన పనివేళలను విద్యాశాఖ ఏకపక్షంగా మార్చుతూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.
పాఠశాలల కొత్త పనివేళలు పాఠశాల సమయం
ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15 వరకు
ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు
ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు