– రాష్ట్రంలో కర్నాటక తరహా ప్రచారం
– కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో జరుగుతున్న భూ కుంభకోణాలపై చార్జిషీట్ వేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్టీ శ్రేణులకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం కర్నాటక తరహా ప్రచార వ్యూహాన్ని అమలు చేయాలని చెప్పారు. శనివారంనాడాయన గాంధీ భవన్‌లో తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులతో భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు దీప దాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీధర్ బాబు, రోహిత్ చౌదరీ, విశ్వనాధ్, మన్సూర్ అలీ ఖాన్, వంశీచంద్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సంపత్ కుమార్, ప్రచార కమిటీ చైర్మెన్ మధు యాష్కీ, ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మెన్ దామోదర్ రాజనర్సింహతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పార్లమెంట్ పరిశీలకులు పాల్గొన్నారు. ఈ సమావేశ వివరాలను పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ మీడియాకు వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవడానికి కేసీ వేణుగోపాల్ పలు సూచనలు చేసారని చెప్పారు. ట్రైబల్ డే రోజు తాండాలలో బస చేయాలని నిర్ణయించామన్నారు. ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్15 లోపు జహీరాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ పార్లమెంట్ పరిధిల్లో నాలుగు బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు. ఒక్కో బహిరంగ సభకు ఒక్కో ముఖ్య నేత వస్తారని వివరించారు.