– మధ్యంతర బెయిల్‌ను పొడిగించిన సుప్రీం కోర్టు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు సుప్రీంకోర్టులో మరోసారి ఊరట లభించింది. అత్యున్నత న్యాయస్థానం ఆమె మధ్యంతర బెయిల్‌ను పొడిగించింది. అలాగే ఆమెకు సాధారణ బెయిల్‌ను తిరస్కరించిన గుజరాత్ హైకోర్టు ఉత్తర్వులపై మధ్యంతర స్టేను కూడా పొడించింది. జులై 19 వరకు అరెస్టు నుంచి వెసులుబాటు కల్పించింది. సాధారణ బెయిల్ కోసం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన తీస్తా సెతల్వాద్ అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు తిరస్కరించడంతో పాటు తక్షణమే లొంగిపోవాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ తీస్తా సెతల్వాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ దీపాంకర్ దత్తలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారించింది. అఫిడవిట్ దాఖలు చేయాలని గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 19 మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. గుజరాత్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో పాటు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు వాదనలు వినిపించారు. కొన్ని పత్రాలను అనువదించడానికి తమకు సమయం కావాలని ధర్మాసనాన్ని కోరారు. తీస్తా సెతల్వాద్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. కాగా గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై తీస్తా సెతల్వాద్‌పై గతంలో కేసు నమోదైంది. అమాయకులను కేసులో ఇరికించేందుకు కుట్రపన్నారంటూ ఆమెపై పోలీసులు అభియోగాలు మోపారు. ఆ కేసులో భాగంగా గతంలో గుజరాత్ యాంట్ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్) ముంబయిలో తీస్తాను అదుపులోకి తీసుకున్నది. ఆ తరువాత ఆమె రెండు నెలల పాటు జైల్లో ఉన్నారు. తనకు బెయిల్ నిరాకరిస్తూ సెషన్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సెతల్వాద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై గత సెప్టెంబర్ ఆమెకు ఊరట లభించింది. అప్పటి నుంచి మధ్యంతర బెయిల్‌పై ఆమె బయట ఉన్నారు. అయితే ఆమె సాధారణ బెయిల్ కోసం కొద్దిరోజుల క్రితం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు తిరస్కరించడంతో పాటు తక్షణమే లొంగిపోవాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏడు రోజుల పాటు సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే విధించింది. తాజాగా మధ్యంతర బెయిల్‌ను జులై 19 వరకు పొడిగించింది.