నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉన్న 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్‌వాడీ టీచర్లు, మినీ అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ హెల్పర్‌లకు ఏప్రిల్ 30 నాటికి 65 ఏళ్ల వయస్సును నిర్దేశించారు. ఉద్యోగ విరమణ చేసే అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద అంగన్‌వాడీ టీచర్‌లకు రూ. ఒక లక్ష మినీ అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ హెల్పర్‌లకు రూ.50 వేలు అందజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు పదవి విరమణ తర్వాత ఆసరా పెన్షన్ మంజూరు చేయనున్నారు. ఈ నిర్ణయాల పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
హామీలకు కట్టుబడి ఉండాలి : అంగన్వాడీ యూనియన్
అంగన్‌వాడీ సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ , హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.సునీత, ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి, కోశాధికారి పి. మంగ ఒక ప్రకటన విడుదల చేశారు.