– ప్రారంభించిన సిఎం స్టాలిన్
నాగపట్టణం: రాష్ట్రంలోని పాఠశాలల్లోనే పిల్లలకు ఉచితంగా అల్పాహారం అందించేందుకు ఉద్దేశించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ను తమిళనాడు సీఎం స్టాలిన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తమిళనాడు రాష్ట్ర ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు ఉదయం పూట అల్పాహారం అందించనున్నారు. దీంతో దేశంలోనే పాఠశాలల్లో అల్పాహారం అందిస్తున్న తొలి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. నాగపట్టణం జిల్లాలోని తిరుక్కువళై ప్రాథమిక పాఠశాలలో ఈ స్కీం రెండో విడతను ప్రారంభించిన సీఎం స్టాలిన్.. చిన్నారులకు అందించే అల్పాహారాన్ని దగ్గరుండి పరిశీలించారు. అనంతరం పిల్లలకు స్వయంగా వడ్డించిన ముఖ్యమంత్రి.. తాను కూడా చిన్నారులతో కలిసి అల్పాహారం తిన్నారు. చెన్నైలో స్టాలిన్ కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి ఈ పథకాన్ని ప్రారంభించారు.
వాస్తవానికి ఈ పథకాన్ని గతేడాది సెప్టెంబరులోనే ప్రకటించిన స్టాలిన్ సర్కారు.. ప్రయోగాత్మకంగా 1545 పాఠశాలల్లో ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పథకం విజయవంతమవడంతో ఇప్పుడు శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 31,008 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు దీన్ని విస్తరించారు.