బాలలు భావి తరాల సంపద

Children are the wealth of future generations– వారితోనే దేశ భవిష్యత్‌ : బాలోత్సవ పోస్టర్‌ ఆవిష్కరణలో కేవీ రమణాచారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘పిల్లల కంటే ప్రపంచంలో విలువైనది మరేదీ లేదు. బాలలే భావితరాల సంపద. పిల్లల గురించి ఆలోచించడం అంటేనే దేశ భవిష్యత్తు గురించి ఆలోచించడం’ అని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, తెలంగాణ బాలోత్సవం పిల్లల జాతరం ఆహ్వాన సంఘం అధ్యక్షులు కేవీ రమణా చార్యులు అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో పిల్లల జాతర 2023 పోస్టర్‌ను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చేనెల 16 17 18 తేదీల్లో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ బాలోత్సవం పిల్లల జాతర వైభవంగా జరుగుతున్నట్టు తెలిపారు. మార్పు ఏదైనా మొదట పిల్లలనుండే రావాలన్నారు. అది సమాజ పురోగమనానికి ఉపయోగపడితే..అంతకంటే కావాల్సిందేముందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పిల్లల్లో సోదరత్వాన్ని పెంపొందించేలా..వారంతా చట్టాపట్ట్టాలు పట్టుకుని బారులు తీరే ఈ జాతరకు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. వారిలో దాగిన అసమాన ప్రతిభా పాటవాలకు ఒక వేదిక ఈ జాతర అన్నారు. పదివేల మంది విద్యార్థులు మూడు రోజులు 350 పాఠశాలల నుంచి హాజరుకానున్నారని తెలిపారు. జాతీయ సినీ గేయ రచయిత, బాలోత్సవం గౌరవ సలహాదారులు సుద్దాల అశోక్‌ తేజ మాట్లాడుతూ… మార్కులు, ర్యాంకులు, పరుగులు ఈ క్రమంలో మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య విజయాల కోసమే కాదనీ, విలువల కోసమని బాలోత్సవం చాటి చెబుతున్నదన్నారు. అనేక కథలు, కబుర్లు, మహనీయుల ధైర్యం, శౌర్యం, సేవాగుణం వంటి విషయాలు ఉత్సవాల సందర్భంగా వినే అవకాశాలుంటాయని చెప్పారు.     తెలంగాణ బాలోత్సవం అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… బాలల ఆటపాటలకు ఆనవాళ్లు ఈ పిల్లల జాతరనీ, సాంస్కృతిక రంగంలో 10 రకాల కార్యక్రమాలు సాహిత్య రంగంలో 12 రకాలు బాలలే భవితకు సోపానాలుగా పిల్లలే పిడుగులై తమ ప్రతిభ పాటవాలకు ప్రదర్శన వేదికగా తెలంగాణ బాలోత్సవం నిర్వహిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ బాలోత్సవం ప్రధాన కార్యదర్శి ఎన్‌ సోమయ్య మాట్లాడుతూ.. సైన్స్‌ ఎగ్జిబిషన్‌లు, శాస్త్రీయ ఆలోచనలు పెంచే విధంగా కార్యక్రమాలుంటాయని పేర్కొన్నారు. తెలంగాణ బాలోత్సవం ఉపాద్యక్షురాలు కె సుజావతి కార్యక్రమంలో పాల్గొన్నారు.