శాంటియాగో: సంప్రదాయవాదంతో రచించిన రాజ్యాంగాన్ని చిలీ ఓటర్లు తిరస్కరిం చారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించిన ఓటింగ్‌లో ప్రతిపాదిత సంప్రదాయవాద రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుమారు 55.8 శాతం మంది ఓటు వేశారు. అనుకూలంగా 44.2 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. లెఫ్ట్ లైనింగ్ కన్వెన్షన్ రచించిన కొత్త రాజ్యాంగాన్ని ఏడాది క్రితం తిరస్కరించిన ఓటర్లు తాజాగా సంప్రదాయవాద రాజ్యాంగాన్ని తిరస్కరించారు. లెఫ్ట్ లైనింగ్ కన్వెన్షన్ రచించిన కొత్త రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత ప్రగతిశీల చార్టర్‌ల్లో ఒకటిగా పేర్కొనబడింది. మరోవైపు ఈ ప్రతిపాదిత సంప్రదాయ రాజ్యాంగంపై తొలి నుంచి అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ రాజ్యాంగం స్వేచ్ఛా మార్కెట్‌కు అనుకూలంగా ఉందని, ప్రజా సంక్షేమ కార్యక్రమంలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గిస్తుందని, మహిళా హక్కులను పరిమితం చేసేవిధంగా ఉందని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా గర్భస్రావం పూర్తిగా చట్టవిరుద్ధం అవుతుందని కొంత మంది హెచ్చరించారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న, సమాజానికి పెద్ద ప్రమాదంగా భావించని ఖైదీలను గృహ నిర్భంధానికి పరిమితం చేయడానికి ఈ రాజ్యాంగం అవకాశం కల్పిస్తుంది. ప్రతిపాదిత రాజ్యాంగాన్ని ప్రజలు తిరస్కరించిన నేపథ్యంలో ఈ అంశాన్ని మళ్లీ లేవనెత్తవద్దని ప్రభుత్వానికి కన్జర్వేటివ్ ఇండిపెండెంట్ డెమోక్రటిక్ యూనియన్ పార్టీ నాయకులు జేవియర్ మకాయా విజ్ఞప్తి చేశారు. చిలీలో 2019 నుంచి కొత్త రాజ్యాంగాన్ని రచించే ప్రక్రియ ప్రారంభమయింది. 2022లో జరిగిన ఓటింగ్‌లో లెఫ్ట్ లైనింగ్ కన్వెన్షన్ రచించిన కొత్త రాజ్యాంగానికి వ్యతిరేకంగా 62 శాతం మంది ఓటు వేశారు.