
ఇంతవరకు ప్రపంచంలో చైనా గురించి చేసినన్ని తప్పుడు ప్రచారాలు మరొక దేశం గురించి లేవంటే అతిశయోక్తి కాదేమో! ఎవరు అవునన్నా కాదన్నా చైనా నేడు సాంకేతిక, ఆర్థిక రంగాల్లోనే కాదు, శాస్త్ర రంగంలో కూడా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలను సవాలు చేస్తూ ముందుకు పోతోంది. అది కూలిపోవాలి, పేలిపోవాలని ఎన్ని దుష్ట కోరికలు కోరుకున్న ప్పటికీ, కూలుతుందని తేదీలు, సంవత్సరాలను ఉటంకించినప్పటికీ అలాంటి జాడలేమీ లేవు. అనేక రంగాలలో ముందుకు పోవటానికి కారణం జనానికి జవాబుదారీగా ఉండే కమ్యూనిస్టు భావజాలం కలిగిన శక్తులు అక్కడ అధికారంలో ఉండటమే కారణం.
ప్రకృతి విజ్ఞానం (నేచురల్ సైన్స్)లో అమెరికాను వెనక్కు నెట్టి చైనా ప్రథమ స్థానానికి వచ్చిందన్నది ఒక నివేదిక. ”మేలుకో అమెరికా : నవ కల్పన ఉత్పత్తిలో అమెరికాను అధిగమిస్తున్న చైనా” అనే శీర్షికతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఐటిఐఎఫ్) ఒక నివేదికలో హెచ్చరించింది. ”చైనా నకిలీ సైన్సు పరిశ్రమ” అంటూ ఫైనాన్సియల్ టైమ్స్ పత్రిక ఒక పెద్ద నింద మోపింది. ఇవన్నీ ఇటీవల చైనా గురించి వచ్చిన విశ్లేషణలు, వార్తలకు సంబంధించిన అంశాలు. ప్రకృతి విజ్ఞానంలో చైనా తొలిసారిగా అమెరికాను అధిగమించి ఒకటవ స్థానంలో ఉన్నట్లు నేచర్ ఇండెక్స్ పేర్కొన్నది. అగ్రశ్రేణి పత్రికల్లో 2022 సంవత్సరంలో ప్రచురితమైన పరిశోధనా పత్రాల ఆధారంగా ఈ సూచికను రూపొందించారు. ఎనభై రెండు పత్రికల్లో చైనాకు చెందిన వారు సమర్పించిన పత్రాలు 19,373 కాగా అమెరికా నుంచి వచ్చినవి 17,610 ఉన్నాయి. ఏ దేశానికి చెందిన వారైనా ఏ దేశం నుంచి పత్రాలను సమర్పిస్తే వాటిని ఆ దేశాల ఖాతాలో వేస్తారు. ప్రకృతి విజ్ఞాన పరిశోధనా పత్రాల సమర్పణలో చైనా, అమెరికా, జర్మనీ, బ్రిటన్, జపాన్ మొదటి ఐదు స్థానాల్లో ఉండగా మన దేశం పదవ స్థానంలో ఉంది. భౌతిక, రసాయన శాస్త్ర పరిశోధనల్లో 2021లో చైనా మొదటి స్థానంలో ఉంది. తాజా సమాచారాన్ని పరిశీలించినప్పుడు భూమి, పర్యావరణ శాస్త్రాలలో కూడా తొలిసారిగా అమెరికాను వెనక్కు నెట్టి చైనా ముందుకు వచ్చింది. గతేడాది వివరాలను పరిశీలించినప్పుడు ప్రపంచ అగ్రశ్రేణి 50పరిశోధన ఉత్పాదక సంస్థలలో చైనా సైన్సెస్ అకాడమీ ఒకటవదిగా ఉండగా మొత్తం 19 చైనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఆ జాబితాలో ఉన్నాయి. 2010 నుంచి జాతీయ సమతూకంలో మార్పు ఉన్నట్లు నేచర్ ఇండెక్స్ ప్రకటన పేర్కొంది. 2018-2020 సంవత్సరాలలో ఉటంకించిన అగ్రశ్రేణి ఒకశాతం పరిశోధనా పత్రాలలో అమెరికా కంటే చైనావే ఎక్కువగా ఉన్నట్లు సైన్సెస్ అండ్ టెక్నాలజీ జపాన్ జాతీయ సంస్థ 2022 నివేదిక పేర్కొన్నది. నిజానికి 2018లోనే మొత్తం పరిశోధనా పత్రాల సమర్పణలో అమెరికా, ఐరోపాను వెనక్కు నెట్టి చైనా ముందుంది.
2018 నుంచి 2020వరకు ప్రపంచ శాస్త్ర పత్రాలలో 23.4శాతంతో చైనా అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతానికి జీవశాస్త్ర రంగంలోనే అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అమెరికా ఎన్నో శతాబ్దాలు ముందుండి పరుగులు పెడుతుంటే చైనా ఇటీవలనే నడక ప్రారంభించింది. అందుకే ఇప్పటికీ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు కొన్ని రంగాలలో ముందున్నాయి. నోబెల్ బహుమతులను కొలబద్దగా తీసుకుంటే 403తో అమెరికా, 137తో బ్రిటన్, 114తో జర్మనీ మొదటి మూడు స్థానాల్లో ఉండగా చైనా తొమ్మిదితో 23వ స్థానంలో ఉంది. 2015లో పశ్చిమ దేశాల సైన్సు పత్రికలలో చైనా పరిశోధనా పత్రాలు కేవలం ఏడున్నరవేలు మాత్రమే ప్రచురణకు నోచుకోగా అమెరికా నుంచి 21వేలవరకు ఉన్నాయి. 2020 అమెరికా పత్రాలు స్వల్ప తేడాతో స్థిరంగా ఉండగా తరువాత తగ్గటం ప్రారంభమైంది. మరోవైపున అచిర కాలంలోనే చైనా దాన్ని అధిగమించింది. పశ్చిమ దేశాల పరిశోధనా సంస్థలు కొన్ని రంగాలలో తప్పనిసరైతే తప్ప చైనా లేదా మరొక వర్థమాన దేశంతో సహకరించటం లేదన్నది తెలిసిందే. కొత్తవాటిని కనుగొనటం కాకుండా ఉన్నవాటిని కాపీ కొడుతుందని ఇప్పటికీ చైనా గురించి చెప్పేవారు మనకు కనిపిస్తారు. అదే నిజమైతే మిగిలిన దేశాలకూ అలాంటి అవకాశం ఉన్నట్లే, మరి అవెందుకు ఆ పని చేయటం లేదు? మన దేశంలో నకిలీ డిగ్రీలు, చివరికి పిహెచ్‌డి థీసిస్‌లను కూడా కొనుక్కొని పట్టాలు పొందవచ్చు కనుక అనేక మంది చైనా గురించి జరుగుతున్న ప్రచారాన్ని నమ్మటంలో వింత లేదు.
వాషింగ్టన్ డిసి కేంద్రంగా పని చేస్తున్న ఐటిఐఎఫ్‌కు చైనా మీద ఎలాంటి ప్రత్యేక అభిమానం ఏమీ ఉండదు, అది అమెరికాలోని ఒక స్వచ్చంద సంస్థ. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన నివేదికలో అమెరికా పాలకవర్గానికి ఒక హెచ్చరిక చేసింది. చైనాను ఒక నవకల్పన దేశానికి బదులు అనుకరించేది అని తక్కువగా అంచనా వేస్తే తనకు తానే ఆపద కొనితెచ్చుకున్నట్లు అవుతుందని పేర్కొన్నది. 2020 నాటికి అంతర్జాతీయ పేటెంట్ కుటుంబాల (అమ్మా, నాన్న, పిల్లలు కుటుంబం అన్నట్లే, ఒక పేటెంట్ దానికి అనుబంధంగా పేటెంట్లు ఉండటాన్ని కూడా కుటుంబంగా పరిగణిస్తారు) సంఖ్య అమెరికా కంటే చైనాకు చెందినవి ఐదు రెట్లు ఉన్నట్లు చెప్పింది. నవకల్పనలో అమెరికా ఆధిపత్యాన్ని పునరుద్దరించాలని విధాన నిర్ణేతలకు సూచించింది. మేడిన్ చైనా 2025 వ్యూహం ప్రకారం ఆ దేశం ముందుకు పోతున్నదని కూడా చెప్పింది. పరిశోధనా రంగంలో సాధిస్తున్న ప్రగతిని పేర్కొంటూ 2010లో ఐరోపా సమాఖ్య ప్రకటించిన పరిశోధన-అభివృద్ధి రంగంలో పెట్టుబడుల సూచికలో 1,400 కంపెనీలకు గాను 19 చైనా కంపెనీలుండగా 2020 నాటికి 278కి పెరగ్గా ఇదే కాలంలో అమెరికా సంస్థలు 487 నుంచి 449కి తగ్గాయి. సైన్స్, ఇంజనీరింగ్ పరిశోధనా పత్రాలు 2020లో 7,42,000 కాగా అవి అమెరికా కంటే 123.7శాతం ఎక్కువని ఐటిఐఎఫ్ పేర్కొన్నది. పేటెంట్ల లైసన్సు ద్వారా వచ్చే రాబడిలో అమెరికా ఎంతో ముందుంది. చైనాకు 2016లో అమెరికాకు వచ్చే రాబడిలో కేవలం రెండుశాతమే రాగా 2020 నాటికి 12శాతానికి పెరిగిందని ప్రపంచ బాంకు సమాచారం వెల్లడించింది. సూపర్ కంప్యూటర్లలో 2020 నాటికి 500 అగ్రశ్రేణి వ్యవస్థలకు గాను చైనాలో 214 ఉండగా అమెరికా 113 మాత్రమే ఉన్నాయి. పారిశ్రామిక రోబోల వినియోగంలో 2010 అమెరికాతో పోలిస్తే పదికి ఒకటి ఉండగా ఇప్పుడు అమెరికాతో సమంగా ఉన్నాయి. గణనీయ పురోగతి ఉన్నప్పటికీ చైనా ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఐటిఐఎఫ్ పేర్కొన్నది.
ఎలక్ట్రిక్ బాటరీలు, హైపర్‌సోనిక్, 5జి, 6జి, నానో స్కేల్ మెటీరియల్స్, సింథటిక్ బయాలజీ వంటి కొన్ని రంగాలలో తిరుగులేనిదిగా ఉన్న చైనా 44 సాంకేతిక పరిజ్ఞానాల్లో 37లో ముందున్నదని ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పోలసీ ఇనిస్టిట్యూట్ అనే మేథో సంస్థ 2022 నివేదికలో పేర్కొన్నది. మిగిలిన ఏడింటిలో అమెరికా ముందున్నట్లు తెలిపింది. ప్రపంచంలోని పది అగ్రశ్రేణి పరిశోధనా సంస్థలు చైనాలో ఉన్నాయని, అమెరికాకంటే తొమ్మిది రెట్లు పరిశోధనా పత్రాలను అవి రూపొం దిస్తున్నట్లు , షీ జిన్‌పింగ్, అంతకు ముందున్న నేతల మార్గదర్శకత్వంలో ఈ కృషి కొనసాగుతున్నదని పేర్కొన్నది. అణ్వాయుధాలను మోసుకుపోగల హైపర్‌సోనిక్ క్షిపణులను 2021లో పరీక్షించిన తీరును చూసి అమెరికా గూఢచార సంస్థలు ఆశ్చర్యపడనవసరం లేదని, గడచిన ఐదు సంవత్సరాలలో ప్రపంచంలో పెద్ద ప్రభావం కలిగించే మొత్తం పరిశోధనా పత్రాల్లో 48.49శాతం ఒక్క చైనా నుంచే ఉన్నట్లు ఆస్ట్రేలియన్ సంస్థ పేర్కొన్నది.
పరిశోధనల్లో వివిధ దేశాల మధ్య సహకారం కొత్తదేమీ కాదు. సహకరించిన వారెవరైనా ఏ దేశానికి చెందిన వారు పరిశోధనా పత్రాన్ని సమర్పిస్తే దాన్ని ఆ దేశ ఖాతాలో వేస్తారు. చైనా నుంచి వస్తున్న పరిశోధనా పత్రాలు ఇతరుల సహకారంతో సమర్పిస్తున్నవని కొందరు చైనాను తక్కువ చేసి చూపేందుకు చూస్తున్నారు. రెండవది చైనా తమ పరిశోధన అంశాలను తస్కరిస్తున్నారని నిందిస్తున్నారు. మన దేశంతో సహా అనేక దేశాల సంప్రదాయ విజ్ఞానాన్ని అమెరికా, ఐరోపా దేశాలు అపహరించి తమ పేరుతో మేథో సంపత్తి హక్కులు పొందాయి. అందుకు ఒక చక్కటి ఉదాహరణ మన దేశం నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించినట్లు చెబుతున్న పసుపు మీద అమెరికా పేటెంట్ హక్కు దాఖలు పరచుకుంది. దాని మీద మన దేశం చట్టబద్దమైన పోరాటం చేసి విజయం సాధించింది. ఇలాంటి అవకాశం ఏ దేశానికైనా ఉంది. కొందరు ఆరోపిస్తున్నట్లు చైనా కూడా అలాంటి పని చేస్తే దాన్ని కూడా కోర్టులకు లాగవచ్చు. ఎవరి విజ్ఞానాన్ని వారు పరిరక్షించు కోవచ్చు. విద్యుత్ బల్బును కనుగొన్నది ఎవరని అడిగితే ఠకీమని చెప్పే జవాబు థామస్ ఎడిసన్ అని వస్తుంది. కానీ ఎడిసన్ కంటే ముందే అనేక మంది దాని మీద పరిశోధనలు చేశారు, బల్బులను రూపొందించారు. దాని కొనసాగింపుగా ఎడిసన్ తన పరిశోధనలను జోడించి ఆ బల్బును వాణిజ్యపరంగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు అనుసరించిన క్రమం గురించి పేటెంట్ పొందాడు. దాంతో పేరు అతనికి వచ్చింది. ఆ పరిశోధనలో అనేక మంది ఎడిసన్‌కు సహకరించారన్నది గమనిం చాలి. మరొకరెవరూ తదుపరి పరిశోధనలు చేయకూడదు, ఎడిసన్ లేదా అతని వారసులు మాత్రమే చేయాలంటే ఈ రోజు ఇన్ని రకాల బల్బులు వచ్చి ఉండేవి కాదు. పరిశోధనలకు మూలం అంతకు ముందున్న తరాల విజ్ఞానమే అన్నది తెలిసిందే.
చైనా శాస్త్రవేత్తల పరిశోధనల్లో పెద్దగా పస ఉండదు. నాసిరకం, ఇతరులు చేసిన వాటిని అటూ ఇటూ మార్చి నూతన పరిశోధనల పేరుతో సమర్పిస్తున్నారు, ఒకే వనరు నుంచి కాపీ పరిశోధనలు వస్తున్నాయి, ఇతరులు బొమ్మలను మరోకోణంలో కొత్తవిగా చూపుతున్నారు అనే ఆరోపణలు చేస్తున్నారు కొందరు. చైనాలో ఉన్న అవినీతిని తొలగించేందుకు ఎలాంటి కఠిన శిక్షలను అమలు చేస్తున్నారో తెలిసిందే. పరిశోధనా రంగంలో ఉన్నవారు కూడా అవినీతికి పాల్పడితేవారి నుంచి వచ్చిన వాటిని అంతర్జాతీయ సమాజం పక్కన పెట్టవచ్చు. పరిశోధనలను ప్రోత్సహించే క్రమంలో ప్రచురించిన పత్రాల ప్రాతిపదికన చైనా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించిన కారణంగా కొందరు అవినీతికి పాల్పడి ఉండవచ్చు తప్ప మొత్తంగా నకిలీ అనే వారిని చేసేదేమీ లేదు. ఇప్పుడు అలాంటి ప్రోత్సాహకాలను నిలిపివేసింది. అక్కడ జరుగుతున్న అభివృద్ధి వాస్తవం, సాధిస్తున్న అద్బుతాలు నిజం. ఈ పూర్వరంగంలో చైనా మీద బురద చల్లేందుకు కుహనా శాస్త్ర పరిశ్రమ పేరుతో వారినీ వీరిని ఉటంకించి ఫైనాన్సియల్ టైమ్స్ ఒక కథను అల్లింది. చైనాదంతా బోగస్ అని అమెరికా ఇతరులను నమ్మించేందుకు ప్రచారం చేయవచ్చు తప్ప దాన్ని వారే నమ్మటం లేదు. చైనాతో పోటీని తట్టుకొనేందుకు వచ్చే పది సంవత్సరాల్లో శాస్త్ర పరిశోధనలకు రెండు వందల బిలియన్ డాలర్లను అధ్యక్షుడు జో బైడెన్ నిధుల మంజూరు చేసేవాడే కాదు. ఇంతవరకు ప్రపంచంలో చైనా గురించి చేసినన్ని తప్పుడు ప్రచారాలు మరొక దేశం గురించి లేవంటే అతిశయోక్తి కాదేమో! ఎవరు అవునన్నా కాదన్నా చైనా నేడు సాంకేతిక, ఆర్థిక రంగాల్లోనే కాదు, శాస్త్ర రంగంలో కూడా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలను సవాలు చేస్తూ ముందుకు పోతోంది. అది కూలిపోవాలి, పేలిపోవాలని ఎన్ని దుష్ట కోరికలు కోరుకున్న ప్పటికీ, కూలుతుందని తేదీలు, సంవత్సరాలను ఉటంకించినప్పటికీ అలాంటి జాడలేమీ లేవు. అనేక రంగాలలో ముందుకు పోవటానికి కారణం జనానికి జవాబుదారీగా ఉండే కమ్యూనిస్టు భావజాలం కలిగిన శక్తులు అక్కడ అధికారంలో ఉండటమే కారణం. దోపిడీ లేని మరో సమాజ నిర్మాణం సాధ్యమే అని నిరూపించేందుకు కమ్యూనిస్టులు ముందుకు పోతుండగా అడ్డుకొంటున్న ప్రతిసారీ ఆటంకాలను అధిగమించి ముందుకు పోతున్నది. ఆ క్రమంలో ఉన్న లోపాలను చైనా ప్రభుత్వం, పార్టీ కూడా దాచుకోవటం లేదు. వాటిని అధిగమిస్తూ, అందుకు పాల్పడిన వారిని కఠినంగా అదుపు చేస్తూ జగన్నాధ రథం ముందుకు దూసుకెళ్తున్నది.
సెల్: 8331013288
ఎం. కోటేశ్వరరావు