
నవతెలంగాణ – అశ్వారావుపేట: ఆశావర్కర్ల న్యాయమైన సమస్యలు ను పరిష్కరించాలని కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. సోమవారం ఆశా వర్కర్లు సమస్యలు పరిష్కారం కోరుతూ నిరవధిక సమ్మె ను నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మూడు రోడ్ల కూడలి లోని మండల పరిషత్ పూర్వ కార్యాలయం ప్రాంగణంలో ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్త ల సంఘం నాయకురాలు కణితి భారతి అధ్యక్షతన జరిగిన సమ్మె ప్రారంభ సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సప్లై చేస్తున్న మందులను ప్రజలకు అందజేస్తూ తగిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ప్రజారోగ్యం పట్ల అప్రమత్తత పాటిస్తున్నారు అని అన్నారు. అలాగే వీటితో పాటు గర్భిణీ, బాలింతలు, చిన్నపిల్లలకు, ఇతర ప్రజలకు సేవలందిస్తున్నారు అన్నారు. కరోనా మహమ్మారి కాలంలో కరోనా ను నియంత్రించడంలో ఆశా వర్కర్లు కీలకపాత్ర పోషించారు అని తెలిపారు. (డబ్ల్యు.హెచ్.ఒ) ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ గ్లోబల్ లీడర్స్ అని ఆశా వర్కర్లకు అవార్డును కూడా ప్రకటించింది అని హర్షం వ్యక్తం చేసారు. ఇన్ని పనులు నిర్వహిస్తూ పేద ప్రజలకు సేవలందిస్తున్న ఆశా లకు నేటికీ నిర్ధిష్ట వేతనం నిర్ణయం చేయకపోవడం వలన ఆశా వర్కర్లు అన్యాయానికి గురవుతున్నారు అని ఆవేదన చెందారు. గతంతో పోలిస్తే ఈ కాలంలో ఆశా వర్కర్లకు పనిభారం విపరీతంగా పెరిగింది అని, పారితోషికం తో పాటు పారితోషికాలు లేని అనేక పనులను ప్రభుత్వం ఆశా లతో చేయిస్తున్నారని అని. ప్రతిరోజు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు సబ్ సెంటర్స్ లో పని చేయాలని ఆశాలకు ప్రభుత్వం చెప్తున్నది.రోజంతా చేస్తున్న ఆశా ల కు కేవలం రూ.9,750 లు పారితోషికాలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తున్నారు ఆని తెలిపారు. ఒకవైపు పని భారం పెరిగింది. మరొకవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ పరిస్థితిలో వచ్చే పారితోషికాలు సరిపోక ఆశా వర్కర్లు అనేక ఆర్ధిక ఇబ్బందులకు గురౌతున్నారు అని, ఆశా ల పారితోషికాలు రూ.18,000 లకు పెంచి నిర్ధిష్ట వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేశారు. సిపిఐ(ఎం) మండల కార్యదర్శి చిరంజీవి అసంఘటిత కార్మికులకు పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని,నిర్ధిష్ట వేతనం పొందే వరకు పోరాటం సాగించాలని బరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు యూనియన్ నాయకులు భారతి, సమత, నాగమణి, తిరుపతమ్మ, విష్ణు కుమారి, వాణి, చిలకమ్మ, వెంకాయమ్మ తదితరులు పాల్గొన్నారు.