రైల్వే, విద్యుత్‌ రంగ ప్రయివేటీకరణ చర్యలను తిప్పికొట్టండి: సీఐటీయూ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైల్వే, విద్యుత్‌ రంగ సంస్థల ప్రయివేటీకరణ చర్యలను ప్రజల సహకారంతో తిప్పికొట్టాలని సీఐటీయూ శ్రేణులకు ఆ యూనియన్‌ అఖిల భారత కోశాధికారి ఎం.సాయిబాబు పిలుపునిచ్చారు. వాటిలో సంస్కరణల వల్ల ఉద్యోగుల హక్కులకు భంగం కల్గడమే కాకుండా ప్రజల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కల్గుతున్నదన్నారు. వాటి దుష్ఫలితాలు దేశ ప్రజలంతా అనుభవించాల్సి వస్తుందన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ..మోడీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై సీఐటీయూ స్వతంత్రంగా పోరాడిందనీ, ఐక్య ఉద్యమాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నదన్నారు. ఈ పోరాటాల్లో ప్రజలను మరింత భాగస్వామ్యం చేయాలని సీఐటీయూ శ్రేణులకు పిలుపునిచ్చారు. పోరాట కార్యచరణలో భాగంగా అక్టోబర్‌ 1 నుంచి 10 తేదీ వరకు గ్రామస్థాయిలో సన్నాహాలు చేయాలనీ, అక్టోబర్‌ 11 నుంచి 25 తేదీ వరకు మండల సదస్సులు, నవంబర్‌ 3న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ప్రయాణీకులను సమీకరించి నవంబర్‌ 9న రైల్వే స్టేషన్ల వద్ద, విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల వద్ద నవంబర్‌ 16న ధర్నాలు చేయాలన్నారు. ప్రజా స్పందనతో ప్రతిఘటనకు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కౌన్సిల్‌లో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ కూడా మాట్లాడారు. యూనియన్‌ పోరాటాలను, భవిష్యత్‌ కార్యాచరణను వివరించారు.