నవ తెలంగాణ-కందనూలు
జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమీకృత ఆఫీసుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనం రూ.21వేలు అమలు చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ సీతారా మ రావుకు సమస్యలతో కూడి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నూతన కలెక్టరేట్ల నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కొత్త భవంతులను నిర్మించి ఆధునిక సదుపాయాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం అందులో పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి మాత్రం కనీస వేతనాలు అమలు చేయడంలో వివక్షత పాటిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 14మంది సిబ్బందితో నూతన కలెక్టరేట్ పరిశుభ్రంగా ఉంచడం ఎంతవరకు సాధ్యమని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేవలం రూ.7వేలు వేతనమిచ్చి కనీసం పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయకుండా కార్మికుల శ్రమను దోచుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పిన పదేళ్లు గడిచిపోయిన కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయకపోగా ఆ వ్యవస్థను పెంచి పోషించిందన్నారు. అందులో భాగంగా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికైనా కార్మికుల కనీస వేతనాలు అమలు అవుతాయా లేదా అని కార్మికులు ప్రశ్నించుకుంటున్నారని ఆయన అన్నారు. కాబట్టి కలెక్టర్ కార్యాలయం సమీకృత ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బందికి వెంటనే కనీస వేతనాలు అమలుచేసి ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అలివేలమ్మ, భాగ్యమ్మ, సుజాత, కృష్ణవేణి, ఎల్లమ్మ, మంజుల, వెంకటమ్మ, అనసూయ, తదితరులు పాల్గొన్నారు.