– పరిశ్రమ ఎదుట టపాకాయలు కాలుస్తూ.. స్వీట్లు పంచుతూ కార్మికుల సంబురాలు
– బీఎంఎస్ అబద్దపు ప్రచారాన్ని కార్మికులు నమ్మలేదు : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ- సదాశివపేట
సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట పారిశ్రామిక ప్రాంతంలోని నందికంది గ్రామ శివారులో ఉన్న బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో ప్రయివేటు లిమిటెడ్ పరిశ్రమలో శుక్రవారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూ జయకేతనం ఎగురవేసింది. బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షులు ఎస్.మల్లేశంపై సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం ఘన విజయం సాధించారు.
కంపెనీలో 115 ఓట్లు పోలైతే అందులో బీఎంఎస్‌కు 57, సీఐటీయూకు 58 ఓట్లు వచ్చాయి. దాంతో సీఐటీయూ కార్యకర్తలు కంపెనీ ఎదుట టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచుతూ సంబురాలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ.. బీఎంఎస్ చేసిన అసత్యపు, అబద్ధపు ప్రచారాన్ని బ్లూ క్రాఫ్ట్ కంపెనీ కార్మికులు నమ్మలేదన్నారు. నీతి నిజాయితీతో కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఐటీయూనే కార్మికులు గెలిపించుకున్నారన్నారు. ఇతర సంఘం వారు కార్మికులను అనేక ప్రలోభాలకు గురిచేసినా.. చుక్క గుర్తుకే ఓటు వేశారని తెలిపారు. ఈ విజయం బ్లూ క్రాఫ్ట్ కంపెనీ కార్మికుల విజయమన్నారు. కంపెనీలో మెరుగైన వేతన ఒప్పందానికి, కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తామని స్పష్టంచేశారు.
కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు బీరం మల్లేశం, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.మల్లికార్జున్, కార్యదర్శి జి.సాయిలు, జిల్లా ఉపాధ్యక్షులు వి.ప్రవీణ్ కుమార్, నాయకులు నర్సింలు, సంతోష్, మల్లేష్, శ్రీనివాస్, శ్రీధర్, బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఎన్. శ్రీనివాస్, జి.శ్రీనివాస్, వీరేశం, సంజీవరావు, జోసెఫ్, జనార్ధన్, నర్సింలు, సాయిలు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.