సివిల్‌ సర్వెంట్లు ఆదేశాలను పాటిస్తలేరు

– పిటిషన్‌ను తక్షణమే వినండి
– సుప్రీంకోర్టును కోరిన ఢిల్లీ ప్రభుత్వం
న్యూఢిల్లీ : ఢిల్లీలో బ్యూరోక్రాట్ల పోస్టింగ్‌లు, బదిలీలపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా జాబితా చేయాలని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ముందు ఈ కేసును విచారణ చేయాలని తెలిపింది.
ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డి.వై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జె.బి పార్దివాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనాన్ని కోరారు. ” నేను ఢిల్లీ ప్రభుత్వ పాలన వేదనను వ్యక్తపర్చలేను. సివిల్‌ సర్వెంట్లు ఆదేశాలను పాటించటం లేదు” అని న్యాయవాది తెలిపారు. అయితే పాత రాజ్యాంగ ధర్మాసనానికి సంబంధించిన అంశాలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని న్యాయమూర్తులు చెప్పారు. షాదన్‌ ఫరాసత్‌ను నోడల్‌ కౌన్సెల్‌గా నియమిస్తామని తెలిపారు. నాలుగు వారాల్లో సమర్పణలు సిద్ధం చేసుకోవాలనీ, ఆ తర్వాత మీరు(ఢిల్లీ ప్రభుత్వం) దాని జాబితా కోసం మెన్షన్‌ చేయొచ్చని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
ప్రభుత్వంలో పనిచేస్తున్న బ్యూరోక్రాట్‌ల బదిలీలు, పోస్టింగ్‌లను నిర్వహించే అధికారాన్ని రూపొందించడానికి కేంద్రం ఈ ఏడాది మే 19న నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ (సవరణ) ఆర్డినెన్స్‌ను ప్రకటించింది. దేశ రాజధానిలోని అక్కడి ప్రభుత్వం (ఆప్‌ సర్కారు)కు పబ్లిక్‌ ఆర్డర్‌, పోలీసు, భూమి మినహా అన్ని విభాగాల్లోని బ్యూరోక్రాట్‌లపై శాసనాధికారం ఉన్నదని పేర్కొంటూ మే 11న ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును ఈ ఆర్డినెన్స్‌ రద్దు చేసింది.
గత నెలలో ఢిల్లీ గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ (సవరణ) బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత బిల్లు చట్టంగా మారి అధికారాలు లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) ద్వారా కేంద్రం చేతిలోకి వెళ్లిన విషయం విదితమే. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కాబడిన ప్రభుత్వం నుంచి అధికారాలు లాక్కోవటం ఏమిటనీ కేంద్రం తీరుపై ఢిల్లీలోని అధికార ఆప్‌తో సహా దేశంలోని ఇతర పార్టీలు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.