ఓటరు జాబితాపై స్పష్టత ఇవ్వాలి

Clarification should be given on voter list– రాజకీయ పార్టీలకు చేర్పులు, తొలగించిన పేర్ల జాబితా అందుబాటులో ఉంచాలి : కేంద్ర ఎన్నికల సంఘానికి సీపీఎం, సీపీఐ, ఎస్పీ బృందం వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపు, సవరించే ప్రక్రియకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని సీపీఐ(ఎం), సీపీఐ, ఎస్పీ డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ కు సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు నీలోత్పల్‌ బసు, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ.రాజా, ఎస్పీ ఎంపీలు రాం గోపాల్‌ యాదవ్‌, జావిద్‌ అలీ ఖాన్‌ల బృందం వినతి అందజేశారు. 2024 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా 2023 జనవరి 6న, 2023 అక్టోబర్‌ 27న ప్రచురించే ఓటరు జాబితాలతో పాటుగా ఓటరు జాబితాలో పేర్లు చేర్పులు, తొలగింపులు, సవరించడాలను రాజకీయ పార్టీలకు అందజేసి, జాబితాపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ”లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాల్లోని ప్రతి బూత్‌ (పోలింగ్‌ స్థలం) ఓటరు జాబితాను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా మేజిస్ట్రేట్‌ ప్రచురించారు. 2023 జనవరి 6 నుండి 2023 అక్టోబర్‌ 27 వరకు ఓటరు జాబితాలో పెద్ద సంఖ్యలో పేర్లు చేర్చబడ్డాయి. అలాగే చాలా పేర్లు తొలగించబడ్డాయి. చాలా పేర్లు సవరించబడ్డాయి. తొలగించిన పేర్లను ఇంటింటికీ వెళ్లి ధ్రువీకరించడం చాలా ముఖ్యం. దీని కోసం తొలగించబడిన పేర్ల జాబితా డ్రాఫ్ట్‌ రోల్‌ / మదర్‌ రోల్‌, జాబితాను చేర్చబడిన పేర్లతో పాటు రాజకీయ పార్టీలకు అందు బాటులో ఉంచాలి. ఇది చాలా అవసరం. ఎన్నికల సంవత్సరంలో ఓటరు జాబితాను సరిదిద్దడం చాలా ముఖ్యం. తద్వారా స్వేచ్ఛగా, నిష్పక్ష పాతంగా ఎన్నికల నిర్వహణకు ఆస్కారం ఉంటుంది” అని పేర్కొన్నారు.
అయితే ఓటరు జాబితాలో చేర్చిన పేర్ల జాబితా, తొలగించిన పేర్ల జాబితా, సవరించిన పేర్ల జాబితాను రాజకీయ పార్టీలకు ఇవ్వవద్దని ఆదేశాలు ఇచ్చారని, ఈఆర్‌వో ముద్రించకూడదని నిబంధనలు, సూచనలు ఇచ్చారని, ఇది దారుణమని అన్నారు. అయితే ఈఆర్‌వో జాబితాను ముద్రించడానికి, చేర్చిన, తొలగించిన, సవరించిన ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచడానికి నియమాలు, సూచనలు ఉన్నాయని తెలిపారు.”లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎలాంటి రాజకీయ పార్టీల సమావేశం, చర్చలు లేకుండానే ఎలక్టోరల్‌ రోల్స్‌ 2023 మార్చిలో (పత్రం- 10, ఎడిషన్‌- 2) కేంద్ర ఎన్నికల సంఘం కొత్త మాన్యువల్‌ను విడుదల చేసింది. ఓటరు జాబితాలో చేర్చిన, సవరించిన, తొలగించిన పేర్లను మేము కోరుతున్నాము. అన్ని రాజకీయ పార్టీల పేర్లను చేర్చాలి. ఇది పార్టీలకు అందుబాటులో ఉంచాలి. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు-2024 స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించబడేలా పై సవరణ లు, కొత్త నిబంధనలను రద్దు చేయాలి” అని కోరారు.